రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే బెల్టు షాపులపై చర్యలు తీసుకుంటున్నామనీ, అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తామంటూ సీఎం నాలుగు రోజుల కిందటే ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఆయనేమన్నారంటే… బెల్టు షాపులు తీసేసి, ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేసేలా చట్టం తీసుకొచ్చామన్నారు. ఇక్కడే చాలామందికి క్లారిటీ రావడం లేదు. మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామనీ, కేవలం స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా దొరకనీయకుండా చేస్తామని గతంలో జగన్ చెప్పారు. కానీ, ఇప్పుడు బెల్టు షాపులు తీసి… ప్రభుత్వ దుకాణాలు అంటున్నారు. విక్రయ కేంద్రాలు మారుతున్నాయే తప్ప, సంపూర్ణ నిషేధం దిశగా అడుగులు ఇంకా పడుతున్నట్టు లేదు. అయితే, ఇదే పరిస్థితిపై టీడీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో స్పందించారు.
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న చంద్రబాబు నాయుడు, మద్యపాన నిషేధం చేస్తానని గతంలో కూడా చెప్పారని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆయన అమలు చేసిన నిషేధ విధానాన్ని దేశమంతా ఆదర్శంగా తీసుకుంటుందని కోతలు కోశారన్నారు. ఆ తరువాత, లిక్కర్ లాబీతో లోపయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని నిషేధాన్ని ఎత్తేశారని విమర్శించారు. జగన్ సర్కారు దశలవారీగా నిషేధం తీసుకొస్తామంటే మతిలేనట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఎంత నీచమైన పనులకైనా దిగజారే నైజం మీది అంటూ, కుట్ర రాజకీయాలూ హత్యా రాజకీయాలు చేసేదే మీరే అంటూ విజయసాయి విమర్శలు చేశారు.
ఇప్పుడూ… మద్యపాన నిషేధం మీద కదా చర్చ జరుగుతోంది. టీడీపీ విమర్శిస్తున్నది కూడా దాని గురించే కదా. దశలవారీ నిషేధం అంటూనే, ప్రభుత్వ దుకాణాలు తెరవడానికి సిద్ధమౌతున్నారు కదా! మరి, ఆ దశలవారీలో మొదటి దశ ఏది అనే అనుమానం సహజంగానే అందరికీ కలుగుతుంది. దీనిపై విజయసాయి స్పష్టత ఇస్తే బాగుండేది. ఈ సందర్భంలో కూడా వెన్నుపోటనీ, హత్యా రాజకీయాలనీ.. ఇలాంటి అంశాలను లాక్కొచ్చి విమర్శలు చేయడం సందర్భమా..? ఎన్నికల సమయంలో పాత ఇష్యూలన్నీ తవ్వి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. ఇప్పుడా సీజన్ కాదు కదా! ఇప్పుడు పాలన జరుగుతోంది, దానిపై ప్రతిపక్షం ప్రశ్నలు అడుగుతుంది, నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. ఆ పరిధిలో విజయసాయి స్పందించడం లేదు!