ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి విశాఖ వరకూ.. కోర్టుల్లో కార్యకలాపాలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలంటూ.. లాయర్లు విధులు బహిష్కరించారు. వారం రోజులుగా.. ఎవరూ కోర్టుల్లో విధులకు హాజరు కావడం లేదు. దీనికంతటికి కారణం… హైకోర్టుపై ప్రభుత్వానికి దాగుడుమూతలు ఆడుతూండటమే. హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు న్యాయవాదుల్ని అయోమయానికి గురిచేస్తోంది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని సీఎం జగన్.. అమిత్ షాకు నివేదిక ఇచ్చారని జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రభుత్వం పరిశీలిస్తోందని… మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు.
దీంతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. కోస్తా జిల్లా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. కోర్టుల్లో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బార్ అసోసియేషన్ లు నిరవధిక బాయ్ కాట్ కి పిలుపునిచ్చాయి. ప్రతి రోజూ న్యాయవాదులు, కక్షిదారులు కోర్టులకి రావడం, కేసులు వాయిదాలు పడటంతో తిరిగి వెళ్లడం జరుగుతోంది. వారం రోజులుగా కోర్టుల్లో పరిస్థితి ఇదే. కేసులు పేరుకుపోతున్నాయి. రిమాండ్ లో ఉన్న నిందితులు, శిక్షలు పూర్తైన ఖైదీలు కూడా జైళ్లలోనే మగ్గిపోతున్నారు. సివిల్ కేసులకి సంబంధించిన ఆర్డర్లు పాస్ కావడం లేదు.
కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే… ఏ పరిశ్రమలో, విద్యా సంస్థలు వంటివో నెలకొల్పాలి కానీ… అందర్నీ ఇబ్బంది పెట్టేలా హైకోర్టుని తరలించడం ఏమిటని లాయర్లు ప్రశ్నిస్తున్నారు. లాయర్ల ఆందోళన అంతా ప్రభుత్వం స్పందించడం లేదనే. హైకోర్టుని మార్చేది లేదని ప్రకటిస్తే అంతా సర్దుకుంటుందని లాయర్లు చెబుతున్నారు. కానీ… ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఇది కోస్తా జిల్లాల న్యాయవాదుల్ని మరింత అసహనానికి గురి చేస్తోంది.