అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వంలో ఒక్క సారిగా చలనం వచ్చింది. నిర్మాణాలన్నీ ఆగిపోయాయని ఇప్పుడే తెలిసినట్లుగా హడావుడి ప్రారభించేసింది. నిర్మాణాలను పూర్తి చేయడానికి అత్యవసరంగా నిధులు అవసరం కాబట్టి రుణాలు తీసుకునేందుకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. శరవేగంగా నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. నిజానికి రేయింబవళ్లు జరిగే పనులతో సందడిగా ఉండే అమరావతి ప్రాంతాన్ని … పూర్తిగా నిర్మానుష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్క పనీ జరగనీయలేదు. ఆ దశలో పనులు ఆపితే.. వందల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా .. డోంట్ కేర్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటుక కూడా పెట్టనీయలేదు. మధ్యలో అమరావతిపై అనేకానేక నిందలు వేశారు. ఎడారి అన్నారు..స్మశానం అన్నారు. అయితే ఇప్పుడు వాటిలో నిర్మాణాలు పూర్తి చేయాలనుకుంటున్నారు.
అయితే ప్రభుత్వం నిధులు సమీకరిస్తుందని నిర్మాణాలు పూర్తి చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. నమ్మడం లేదు. దీనికి కారణం ప్రభుత్వ వైఖరే. వచ్చే నెల పదో తేదీ వరకూ ఈ హడావుడి ఉంటుందని ఆ తర్వాత మళ్లీ.. అమరావతి అనే మాటే ఎత్తరని అంటున్నారు. దానికి కారణంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల పదో తేదీన జరగనున్నాయి. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లతో పాటు చుట్టుపక్కన మున్సిపలిటీలన్నింటినీ గెల్చుకోవాలంటే… అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నామన్న ఓ భావన పంపించడానికే ఈ ప్రకటనలు చేశారని … అనుకుంటున్నారు. ఇదో జిమ్మిక్గా భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలను నమ్మకపోవడానికి మున్సిపల్ ఎన్నికలే కాదు.. మరికొన్ని కారణాలు ఉన్నాయి. మూడు వేల కోట్ల అప్పునకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అసలు అంత అప్పు ఎవరు ఇస్తారన్నది ఇప్పుడు కీలకమైన సందేహం. ప్రభుత్వానికి రుణపరపతి పూర్తిగా పడిపోయింది. అనేకాకనేక కార్పొరేషన్లు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వాటన్నింటికీ ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. కానీ.. రుమాలివ్వడానికి బ్యాంకులు పెద్దగా ముందుకు రావడంలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరి తెలిసి కూడా… రుణాలిస్తాయని ఎవరూ అనుకోవడంలేదు. మభ్య పెట్టే రాజకీయం కోసమే…ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేస్తామని చెబుతోందని నమ్ముతున్నారు.
నిజానికి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పడం ఇదే మొదటి సారి కాదు. చాలా సార్లు ఈ తరహా ప్రకటనలు చేశారు. కమిటీలు వేశారు. భవనాలను ఎలా వాడుకోవాలో పరిశీలించారు. చివరికి అమ్ముకుందామని కూడా ఆలోచన చేశారు. ఇప్పటికిప్పుడు నిర్మాణాలు ప్రారంభించాలంటే పాత కాంట్రాక్టర్లకు రూ. ఆరు వందల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ముందు వాటికి నిధులు సర్దుబాటు చేయాలి. ప్రభుత్వ ఆ దిశగా ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. అమరావతిని నిరర్థక ఆస్తిగానే పరిగణిస్తోంది. అందుకే ప్రభుత్వం తీరును ప్రజలూ నమ్మడం లేదు.