వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లుగా కేంద్రం లెక్క తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కరాడ్ సమాధానం ఇచ్చారు. ఏ ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నది కూడా వివరించారు. పది జాతీయ బ్యాంకులకూ ఏపీ ప్రభుత్వం చాన్సిచ్చింది. స్టేట్ బ్యాంక్‌కు పదకొండు వేల కోట్ల వరకూ అవకాశం ఇవ్వగా చివరికి ఏపీలో ఎక్కడా పెద్దగా కనిపించని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు ఖాతా పెట్టారు.
ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 2021 నవంబరు మధ్య తీసుకుంది.ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారని వాటిని బడ్దెట్ పద్దుల్లో చూపించడం లేదన్న విమర్శలు విపక్షాల నుంచి వచ్చాయి.
అయితే ఇంకా పెద్ద ఎత్తున రహస్యంగా ఉంచిన అప్పుల వివరాలుఉన్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒక్క స్టేట్ డెలవప్మెంట్ కార్పొరేషన్ పేరుతోనే పాతిక వేల కోట్లు తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. బ్యాంకులు కూడా కొన్ని వివరాలు రహస్యంగా ఉంచుతున్నాయని త్వరలో అన్నీ బయటకు రాక తప్పదంటున్నారు.