ఉద్యోగసంఘం నేత సూర్యనారాయణ జీతాలు, పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు ఇవ్వడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకడం..అదీ కూడా ప్రభుత్వంపై ఫిర్యాదు కోసం అంటే.. అంత తేలిక కాదు. ఖచ్చితంగా అధికార హస్తం ఉండాలి. అలాగే ఆ సూర్యనారాయణ ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తా అంటే కాదు. ఆయనకు ఈ ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చింది.ఆయనను ప్రోత్సహించింది. ఇంకా చెప్పాలంటే సూర్యనారాయణ అనే వ్యక్తికి బలం, బలగం ప్రభుత్వ పెద్దలే. మరి ఆయన ఎందుకు ప్రభుత్వంపై తిరగబడతారు ? ఆయనకు బలం ఇచ్చిన పెద్దలే ఈ కథ నడుపుతున్నారని ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది.
అదే సమయంలో ఆయనపై ఏపీఎన్జీవో నేతలు విరుచుకుపడ్డారు. ఏపీఎన్జీవో సంఘానికి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు.. ప్రభుత్వంపై కాకుండా.. తోటి ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణపై చెలరేగిపోతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. కానీ ఇద్దరూ మాత్రం.. ఒకరి గురించి ఒకరు నిజాలు బయట పెట్టుకుంటున్నారు. ఉద్యోగ సంఘం ముసుగులో వారు చేస్తున్న ఘనకార్యాలు.. అసలు వారికి ఉద్యోగాలు ఎలా వచ్చాయన్నది కూడా చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం రాను రాను మరింత ముదురుతోంది.
ఉద్యోగ సంఘాల మధ్య ఇలా చిచ్చు పెట్టడం అంతా ఓ వ్యూహాత్మక వ్యవహారంలా సాగుతోంది. ముందు ముందు ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలను కల్పించడానికి ఏ మాత్రం సుముఖంగా లేదు. మరో పీఆర్సీ ఇచ్చే చాన్స్ లేదు. డీఏల గురించి మాట్లాడటం లేదు. ఇక బకాయిలు, జీపీఎఫ్ గురించీ మాట్లాడటం లేదు. వీటి గురించి మాట్లాడాల్సిన ఉద్యోగ సంఘ నేతలు.. ఒకరినొకరు విమర్శించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే.. ప్రభుత్వానికి అంత కంటే కావాల్సింది ఏముంది.
ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి డైవర్షన్ ప్లాన్స్ మాత్రం చాలా తెలుసు. అసలు సమస్యలు కాని వాటిని సమస్యలుగా చిత్రీకరించి.. అసలు సమస్యల నుంచి బయటపడుతోంది.. ఇప్పుడు ఉద్యోగుల విషయంలోనూ అదే ఫార్ములా. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ..వారు కొట్లాడుకుంటూంటే.. మధ్యలో అసలు సమస్యను ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోంది. అసలు ప్లాన్ ఇదేనన్న అనుమానం ఇప్పటికే ఉద్యోగుల్లో ప్రారంభమయింది.