స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జరిగే రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘిభావం ప్రకటించింది. రేపు మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఒంటి గంట నుంచి యధావిధిగా బస్సులు తిరుగుతాయని… మంత్రి పేర్ని నాని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ లేఖ రాశారు. ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేస్తే సంస్థ నిలబడుతుందో వివరించారు. ఆ తర్వాత కొంత మంది కార్మిక సంఘాలతోనూ సమావేశమయ్యారు. ఉద్యమానికి మద్దతు తెలియచేస్తానన్నారు.
ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి విపక్షాల బంద్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. బస్సుల్ని మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత . ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియచేస్తారని పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పని చేస్తాయి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని .. విశాఖ ఉక్కుని ప్రజల ఆస్తిగానే ఉంచాలనేది వైసీపీ విధానమని ఆయన చెబుతున్నారు. ఆర్టీసీకి పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ.. తాము భరించి మరీ.. ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రూ. 3600 కోట్ల జీతాలు భారంగా మారినా ప్రజల కోసం ఆర్టీసీని నడుపుతున్నామని అలాగే స్టీల్ ప్లాంట్ ను నడపాలన్న అభిప్రాయాన్ని పరోక్షంగా పేర్ని నాని వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానంగా వైసీపీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. స్టీల్ ప్లాంట్ పై రకరకాల మాటలను చెబుతోందని… నిజాలు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాము కార్మికుల వైపే ఉన్నామని చెప్పుకునేందుకు వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు.