ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద.. వైద్య చికిత్సల కోసం చేసే సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనికి కారణం ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించడమే. ఏపీ సర్కార్ ఇటీవల ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2434 జబ్బులకు చికిత్స అందించేలా విస్తరించారు. దాదాపుగా మనుషులకు వచ్చే అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీలోనే చికిత్స చేయిస్తున్నందున.. ఇక ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్స ఖర్చుల రీఇంబర్స్మెంట్ దరఖాస్తులను స్వీకరించొద్దని ప్రజాప్రతినిధులకు సీఎం కార్యాలయం సూచనలు చేసింది.
డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న రోగాల చికిత్సకు సంబంధించిన క్లెయిములు సీఎం సహాయనిధి కింద స్వీకరించబోమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని ప్రజా ప్రతినిధులను సీఎంవో కోరింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని సీఎంఆర్ఎఫ్ క్లైములు దరఖాస్తులు ప్రజా ప్రతినిధుల పీఏలు మాత్రమే పంపాలని సీఎంవో కోరింది. ప్రభుత్వ నిర్ణయం ఓ రకంగా.. పేద ప్రజలకు మాత్రమే కాదు.. పార్టీ నేతలకు కూడా శరాఘాతమే అవుతుంది.
సీఎంఆర్ఎఫ్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా.. వైసీపీ నేతలు.. ఎంతో మందికి మేలు చేసి.. పార్టీకి ఫ్యాన్స్‌గా మారుస్తూ ఉంటారు. అనూహ్యమైన అనారోగ్య సమస్యలు.. పెద్ద ఎత్తున ఖర్చయ్యే రోగాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు ఇలాంటి వారికి చుక్కలు చూపిస్తూ ఉంటాయి. మెరుగైన వైద్యం అందిస్తారో లేదోనన్న భయం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుని … ఆ మేరకు ఆర్థిక సాయం కోసం .. సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పుడా అవకాశం పోవడం వల్ల క్యాడర్ నుంచి వచ్చే ఒత్తిడికి వైసీపీ ఎమ్మెల్యేలు ఇబ్బందిపడాల్సి రావొచ్చు.
సీఎంఆర్ఎఫ్ లో నిధులు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఫేక్ చెక్కుల కేసు ఇంత వరకూ తేలలేదు. ఎంత మంది ఎన్ని ఫేక్ చెక్కులు వేశారో స్పష్టత లేకుండా పోయింది. సింపుల్‌గా చేధించాల్సిన కేసుల్ని కూడా పోలీసులు చేధించలేకపోతున్నారు. ఓ ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేసే వారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినా… కేసులో పురోగతి లేకపోవడం.. ఇప్పుడు.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల సాయాన్ని నిలిపివేయడం వంటివి వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి.