ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో 2009లో అప్పటి వైఎస్ రాజశేకర్ రెడ్డి సర్కార్ 840 ఎకరాలను కేటాయించింది. ఈ సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన వివరాల ప్రకారం.. అప్పట్లోనే 2,997 కోట్లతో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే కినెటా సంస్థ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంది కానీ.. ధర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టలేదు. కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.
మూడు దఫాలుగా నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కినెటా పవర్‌కు ఇచ్చిన 840 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని ఏపీఐఐసీని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో భూములు వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. భూములు తీసుకుని పరిశ్రమల్ని ఏర్పాటు చేయని సంస్థల నుంచి ఆ భూములు వెనక్కి తీసుకోవడం సహజమే. అయితే ఇక్కడ.. అసలు ట్విస్ట్ ఉంది. ఆ భూములు టీడీపీ నేతలకు చెందినవి కావు. వైసీపీ నేతకు చెందినవే. వైఎస్ సమయం నుంచి ఆ కుటుంబానికి ఆత్మీయుడిగా ఉంటున్న వల్లభనేని బాలశౌరి కినెటా పవర్ ప్రాజెక్ట్ సంస్థకు యజమాని. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు.
ఆయనకు భూములు కేటాయింపుపై చాలా సార్లు వివాదాలు వచ్చాయి. పరిశ్రమ పేరుతో భూములు తీసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నారని.. కానీ పరిశ్రమ మాత్రం పెట్టలేదని విమర్శలు కూడా వచ్చాయి. వైఎస్ హయాంలో భూములు కేటాయించినా.. పరిశ్రమ పెట్టకపోయినా తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండేమిటో… ఒకటి, రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.