పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్ములన్నింటినీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మాత్రమే కాదు గత రెండు నెలలుగా ప్రజల్ని నానా తిప్పలు పెట్టి వసూలు చేస్తున్న ఆస్తి పన్ను, చెత్త పన్నును కూడా వదిలి పెట్టలేదు. అత్యధిక పంచాయతీల్లో సున్నా వచ్చేసింది. దీంతో గగ్గోలు రేగింది. గతంలోనూ ఏపీ ప్రభుత్వం అలాగే తీసుకుంది. అప్పుడు పెండింగ్ కరెంట్ బిల్లుల పేరుతో తీసుకుంది. ఇప్పుడు ఏ పేరుతో తీసుకుందో త్వరలో తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఉన్న చెల్లింపుల ఒత్తిడి కారణంగా ఈ నిధులు తీసుకుని చెల్లింపులు చేసినట్లుగా చెబుతున్నారు.
గత కొద్ది రోజులుగా ఏపీలో చెత్తపన్ను, ఆస్తి పన్ను వసూళ్లు చర్చనీయాంశమయ్యాయి. పెద్ద ఎత్తున అధికారులు టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేశారు. పన్నులు వసూలు చేయకపోతే ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు. చివరికి ఇళ్లల్లో చెత్త పోశారు. ఇళ్లకు తాళాలేశారు. ఎలా అయితేనే చివరికి ప్రజల్ని బెదిరించో… వేధించో వసూలు చేశారు. ప్రభత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా … ప్రభుత్వం ఇలా చేయమని ప్రోత్సహించిందంటే దానికి కారణం.. నిధుల కటకటే. అంతే కానీ..ఆ నిధులేవో పంచాయతీలకు ఉంచాలని కాదు. వసూల చేసింది తాము తీసుకోవడానికే. దానికి తగ్గట్లుగానే అర్థిక సంవత్సరం ముగిసేనాటికి సర్దేసుకుంది.
పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలు. వాటి నిధులపై వాటికి సర్వాధికారం ఉంటుంది. కానీ ప్రభుత్వం వారి ఖాతాల్ని సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేసేసి..ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుంటోంది. కేంద్రం ఇచ్చే నిధులనూ తీసుకుంటోంది. అత్యధిక పంచాయతీలు వైసీపీ అధీనంలోనే ఉన్నాయి. కానీ.. వారి సర్పంచ్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకుండా గ్రామాల్లోని సమస్యలను ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. వీటికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.