సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో విధంగా ముందుకెళ్తోంది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌పై కన్నేసింది. ఈ ట్రస్ట్‌కు దేవాదాయ శాఖ నుంచి తాజాగా నోటీసులు ఇచ్చారు. సంగం డెయిరీ ప్రాంగంలో ఉన్న ఈ ట్రస్ట్ కార్యాలయం ముందు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పేరుతో నోటీసులు అంటించారు. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయము, ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.
అంటే ట్రస్ట్‌కు సంబంధించి ఏ టు జడ్ పత్రాలు సమర్పించాలని లేకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల సారాంశం. సంగం డెయిరీని గతంలో స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సమయంలో ప్రధానంగా ఈ ట్రస్ట్‌పైనే ప్రభుత్వం, వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. 1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి. రైతులకు, సంగం డెయిరీ ఉద్యోగులకు సేవలు అందించేందుకు నిర్మించారు. అయితే ఆస్పత్రి కట్టి పది ఎకరాలు సంగం డెయిరీవని అలా ట్రస్ట్‌కు తీసుకోవడం చట్ట విరుద్ధమన్న కారణాన్ని సంగం డెయిరీ స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పింది.
అయితే ఆ ఆస్పత్రి వల్ల ధూళిపాళ్ల నరేంద్ర కానీ ఆయన కుటుంబం కానీ ఆర్థికంగా లాభపడిందా లేదా అన్న విషయాన్ని మాత్రం కోర్టుకు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆ వివరాలు చెప్పాలని అనుకుంటున్నారేమో కానీ లావాదేవీలు మొత్తం కావాలని దేవాదాయ శాఖద్వారా నోటీసులు పంపించారు. బహుశా ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేశారేమో క్లారిటీ లేదు కానీ.. మొత్తంగా నోటీసులు జారీ చేశారు. పది రోజుల తర్వాత మళ్లీ ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేసే అవకాశ ఉంది.