అగ్రిగోల్డ్‌కు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఆరు వేల ఎకరాల వరకూ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం మధ్య తరగతి వర్గం కోసం ఇళ్లను కట్టించాలని నిర్ణయం తీసుకుంది . అయితే అది ఉచితం కాదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా భారీ ధరకు అమ్మకుండా తక్కువ ధరకే ఇళ్లు ఇమ్మాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం భూసేకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ భారంగా మారింది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ భూముల ఇందుకు బాగా ఉపయోగపడతాయని అంచనా వేశారు.
ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములను పరిశీలించేందుకు కమిటీ వేశారు. ఈ భూములన్నింటినీ ముందుగా పురపాలక శాఖకు బదిలీ చేస్తారు. ఆ తర్వాత అనువైన వాటిలో ఎంఐజీ లేఅవుట్లు వేస్తారు. అయితే ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబధించిన వ్యవహారాలన్నీ తెలంగాణ కోర్టులో ఉన్నాయి. గతంలోనే ఎటాచ్ చేశారు. ఇప్పుడు ఆ ఆస్తులను విడిపించాలంటే డిపాజిటర్లకు మొత్తం చెల్లించాలి. అలా చెల్లించగలిగే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అయితే ఇలా ఎంఐజీ లే ఔట్లు వేసి ప్రజలకు అమ్మేసి..ఆ సొమ్మును డిపాజిటర్లకు చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టును అడిగే అవకాశం ఉంది.
మధ్యతరగతి ప్రజలకు తక్కువ మొత్తానికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు లేఅవుట్లను వేసేందుకు ప్రభుత్వ భూముల కొరతతోపాటు ప్రైవేట్ భూముల సేకరణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అగ్రిగోల్డ్ భూములే ఈ సమస్యకు పరిష్కారమని అంటున్నారు. నిజానికి నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు ఈ భూముల్ని తీసుకున్నట్లయితే సమస్య పరిష్కారమయ్యేదన్న అభిప్రాయం ఉంది.