అమరావతి ఒక్క ఇటుక వేయలేదు. ఒక్క రూపాయి పని చేయలేదు. నిరంతరాయంగా జరుగుతున్న పనుల్ని నిలిపివేశారు. అమరావతిని శ్మశానం అన్నారు. అది మునిగిపోతుందన్నారు. రైతుల్ని ఇష్టం వచ్చినట్లుగా వేధించారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చివరికి అమరావతి భూముల్ని అమ్మి వేల కోట్లు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ మేరకు భూముల్ని ఎకరాకు రూ. పది కోట్ల చొప్పున అమ్మేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.
తొలి ఏడాది దాదాపుగా 250 ఎకరాలు అమ్మి 2500 కోట్లు సేకరిస్తారట. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలకు చెందిన భూములు. మెడ్ సిటీ, లండన్ కింగ్స్ కాలేజీ వంటి అంతర్జాతీయ సంస్థలు మెడికల్ కాలేజీలు నెలకొల్పడానికి భూములు కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఒప్పదాలను పట్టించుకోలేదు. కనీసం ఫాలో అప్ కూడా చేయలేదు. అంతే కాదు అన్నీ ఒప్పందాలను రద్దు చేశారు. ఇప్పుడు వారు సంస్థలు పెట్టడానికి ముందుకురాలేదని.. ఆ భూములు వేలం వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఒక్క సారి కాదు వరుసగా ప్రతీ ఏడాది భూములమ్ముతామని ప్రభుత్వం చెబుతోంది.
అమరావతిని అభిృద్ధి చేస్తే.. ప్రభుత్వానికి ఉన్న మిగులు భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల వరకూ ఆదాయం వస్తుందని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. అమరావతిని అభివృద్ధి చేయకపోగా.. అమరావతి రైతుల్ని ఎంత దారుణంగా వేధించాలో వేధించి.. చివరికి వారికి కౌలు కూడా చెల్లించకుండా.. కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ వారి భూముల్ని మాత్రం అడ్డగోలుగా అమ్ముకుని సొమ్ములు సాధించుకోవాలనుకుంటోంది. కానీ ప్రభుత్వం సీఆర్డీఏ ఒప్పందాల్ని ఎప్పుడో ఉల్లంఘించి.. భూములు అమ్ముతామంటే రైతులు ఊరుంటారా..? కోర్టుకెళ్లరా. అనే సందేహం సహజంగానే వస్తుంది.
రైతులు న్యాయపోరాటం చేసినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నైతికంగా దిగజారిపోయినందునే అమరావతి భూముల్ని అమ్ముకునేందుకు సిద్ధపడిందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. అయితే ఇలాంటివాటిని ప్రభుత్వం ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది.