ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించుకుంది. మూడు విభిన్న ఆదాయవర్గాలను గుర్తించి… వారి కోసం ప్రత్యేకంగా లే ఔట్లు వేయాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు అధికారుల కమిటీల్ని నియమించి ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్ సర్వే చేశారు. వాలంటీర్లను పంపి.. ఇళ్ల స్థలాలు తీసుకుంటారా అని అందర్నీ అడిగారు. అత్యధికులు తమకు ఇంటి స్థలం కావాలని చెప్పారు. దీంతో ప్రజల్లో స్పందన బాగుందని… ప్రభుత్వం రాసేసుకుంది. కానీ అసలు విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతోంది. ప్రభుత్వం .. నిరుపేదలకు ఇచ్చినట్లుగా ఉచితంగా ఇంటి స్థలం ఇస్తుందని ఎక్కువ మంది ఆశపడుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై ఓ ఇమేజ్ ఉంది. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తారనే ఇమేజ్ ప్రజల్లో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం… పట్టణప్రాంతాల్లో మధ్య ఆదాయవర్గాలకు తక్కువ రేట్లకు స్థలాలు ఇవ్వాలి. ఆ తక్కువ రేట్లు ఎంత అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కట్టగలిగేంత తక్కువకే ఇస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.తర్వాత ఎన్నికల టైంకి.. ఉచితం చేసేస్తారనే ఆశలోనూ ఉన్నారు. సహజంగా రాజకీయ పార్టీలు అంతే చేస్తాయి. ఇళ్లు… స్థలాలు ఉచితంగా ఇచ్చేస్తామని చెబుతూంటాయి. ప్రజలు నమ్మేస్తూంటారు. ఎన్నికల తర్వాత ఏదో నిబంధనల చూపి డబ్బులు వసూలు చేస్తూంటాయి. అయితే ఉచితం అనే ఆకర్షణ మాత్రం అలాగే ఉంటుంది.
నిరుపేదల కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను ఒక్కొకరికి సెంటు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు పట్టణ పేదలు కూడా అలాగే ఇస్తారని ఆశిస్తున్నారు. వారి ఆశలో తప్పు లేదు. కానీ డబ్బులు కట్టాలన్న ప్రచారాన్ని ఉద్ధృతంగా చేయకపోతే… తర్వాత ప్రభుత్వం స్థలం ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టమంటే..ఆయా వర్గాల ప్రజలందరూ అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం అవి ఉచితం కాదని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది.