అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులకు సీఎం జగన్ ఈ రోజు మీట నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ. 1150 కోట్లు ఇస్తామని ప్రకటించినా ఇవ్వడానికి ఆలస్యమైంది. గత ఏడాది రూ. 260 కోట్లను రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన వారికి ఇవ్వగా ఇప్పుడు రూ. 10 నుంచి 20వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లిస్తున్నారు. దాదాపుగా ఏడు లక్షల మంది డిపాజిట్ దారులకు రూ. 666 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒకరు ఎన్ని డిపాజిట్లు చేసినప్పటికీ ఒక్క దానికి మాత్రమే చెల్లింపులు చేస్తారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసి గతంలో నష్టపరిహారం పొందలేకపోయిన మూడున్నర లక్షల మంది కోసం మరో రూ.207 కోట్లను పంపిణీ చేయనున్నారు. రెండున్నరేళ్లలోరెండు దశల్లో కలిపి సుమారుగా రూ.900 కోట్లు బాధితులకు పంపిణీ చేసినట్లు అవుతుంది.
మధ్య, పేద వర్గాల్లో అధిక వడ్డీలు ఆశ చూపి .. భారీ ఎజెంట్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకుని వేల కోట్లు డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ చెల్లింపుల్లో విపలమయింది. గత ప్రభుత్వం సీఐడీ కేసులు నమోదు చేసి.. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఆస్తుల వేలం వేయడం ప్రారంభించారు. కారణం ఏమిటో కానీ ఆస్తులు భారీ విలువ ఉన్నప్పటికీ కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గత ప్రభుత్వం ఓ సారి అగ్రిగోల్డ్ ఆస్తులను టేకోవర్ చేసి రూ. మూడు వేల కోట్లకుపైగా చెల్లించాడనికి జీఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. కోర్టులో రూ. 10 కోట్లు సంస్థ తరపున డిపాజిట్ కూడా చేశారు. కానీ తర్వాత వెనక్కి తగ్గింది. తెర వెనుక ఏం జరిగిందో కానీ డిపాజిటర్లకు మాత్రం నిరాశే ఎదురయింది.
డిపాజిటర్లు లక్షల మంది ఉండటంతో .. అగ్రిగోల్డ్ అంశం 2019లో రాజకీయ అంశం అయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి బడ్జెట్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయిస్తానని డిపాజిటర్లందరికీ న్యాయం చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. హామీ ఇచ్చినట్లుగానే బడ్జెట్లో రూ. 1150 కోట్లు పెట్టారు. కానీ ఆ ఏడాది బడ్జెట్లో ఆ సొమ్ము విడుదల చేయలేదు. ఆస్తులు వేలం వేసిన సొమ్ములనే కొద్ది కొద్దిగా విడుదల చేస్తున్నారు