ఏ సంస్థకు అయినా కస్టమర్ ఫీడ్ బ్యాక్ అత్యంత అవసరం. నిజాయితీగా చెప్పే ఫీడ్ బ్యాక్ ద్వారా.. సమస్యలను పరిష్కరించి మరింత మెరుగైన సేవలు అందించి.. బేస్ పెంచుకుంటారు. ప్రభుత్వానికి అయినా అంతే… రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై కరెక్ట్ గా పాలకుడికి చేరితే..దానికి తగ్గట్లుగా మార్పు చేర్పులు చేసుకుని పాలన చేస్తారు. ఈ విషయంలో చంద్రబాబు కేర్ ఫుల్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయసేకరణ చేయాలనుకుంటారు.
కానీ అధికారంలో ఉన్నప్పుడు ఓ సమస్య ఉటుంది. ఎలాంటి రిపోర్టు అయినా ఆహా.. ఓహో అనే వస్తుంది. ఎవరు ఇచ్చినా అంతే ఉంటుంది. అంటే సరైన రిపోర్టు పై వరకూ చేరదని అర్థం. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం 10 అంశాలపై ఐవిఆర్ఎస్తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ చేసింది. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. దానిపై చంద్రబాబు విశ్లేషణ చేశారు.
పింఛన్లు పంపిణీపై 90.20 శాతం మంది లబ్ధిదారులు, ధాన్యం సేకరణలో 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి వ్యక్తమయిందని అధికారులు తెలిపారు అయితే నె సంచుల విషయంలో 30 శాతం అసంతృప్తి చెందారని చెప్పారు. ఇక దేవాలయాల్లో దర్శనాలపై 70 శాతం మంది సంతృప్తి…వసతులపై 37 శాతం భక్తుల్లో అసంతృప్తి ఉందని తేల్చారు. పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సేవలపై 35 శాతం అసంతృప్తి ఉందని..…అవినీతిపై 37 శాతం ఫిర్యాదు చేశారని లెక్కలు వచ్చాయి. వీటిపై .. ప్రజల అసంతృప్తిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.