హైదరాబాద్: గుంటూరుజిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వరంగల్ విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రు.10 లక్షల నగదు, రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం మంజూరు చేసింది. ఇవాళ విజయవాడలో జరిగిన రాష్ట్రప్రభుత్వ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రిషితేశ్వరి మరణంపై విచారణ వేగవంతం చేయాలనికూడా నిర్ణయించారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని, పోలవరం ప్రాజెక్టును 2018నాటికి పూర్తిచేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రత్యేకహోదాకోసం అన్నివిధాలుగా పోరాడతామని మరో మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇవాళ కేంద్రమంత్రి లోక్ సభలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ గురించి కాదని అన్నారు. విభజనతో ఏపీ చాలా నష్టపోయిందని చెప్పారు.