ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ల వ్యవహారంలో … కాంట్రాక్టు మాత్రమే కాదు.. అత్యంత ఖరీదైన ఐదు ఎకరాల స్థలాన్ని కూడా ధారదత్తం చేయబోతున్నారు. విజయవాడ నడిబొడ్డున విద్యాధరపురంలో ఆర్టీసీకి ఉన్న ఖరీదైన స్థలాన్ని ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్ దక్కించుకున్న వారికి రూపాయికే లీజుకిస్తారట. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయడం… ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సంచలనం అవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రిబిడ్డింగ్ సమావేశానికి ముందే.. ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేశారు. అప్పుడే.. పోలవరం రివర్స్ టెండర్లను తక్కువకు వేసిన సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి డబుల్ రేట్లకు… టెండర్ కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగింది. అదే సంస్థ తెలంగాణలో కి.మీ రూ. 36కి ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. ఏపీలో మాత్రం రూ. 60 అడిగినట్లుగా తెలుస్తోంది.
ఇదంతా ప్రి ప్లాన్డ్ గా జరుగుతున్న వ్యవహారం అని ఆర్టీసీలో చర్చ జరుగుతోంది. అయితే.. బస్సుల కాంట్రాక్ట్ మాత్రమే కాదు.. ఆ కంపెనీ అత్యంత విలువైన ఆర్టీసీ భూముల్ని కూడా కట్టబెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు. కి.మీ లెక్కల ఖర్చులు ఆర్టీసీ చెల్లిస్తున్నప్పుడు.. నిర్వహణ, మెయిన్టనెన్స్ మొత్తం సదరు కంపెనీనే పెట్టుకోవాలి. కానీ.. నిర్వహణ, మెయిన్టనెన్స్ భారం ఆర్టీసీపై పడేలా… స్థలాన్ని ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేస్తే గ్యారేజీల పరిధిలో మెయింట్‌నెన్స్ డిపోలు ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆర్టీసీలో సాధారణ బస్సులను అనేకం అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. అద్దెకు బస్సు ఇచ్చేవాళ్లే బస్సును సొంతంగా నిర్వహించుకుంటారు. డ్రైవర్ అద్దె యజమానికి చెందిన వారు ఉంటే.. కండక్టర్ మాత్రం ఆర్టీసీకి చెందిన వారు ఉంటారు. వ్యాపారం అతనే చేస్తున్నాడు కాబట్టి.. మెయింట్‌నెన్స్ కూడా అతనే చేసుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం … ఆ భారం మొత్తం ఆర్టీసీపై వేస్తున్నారు. మొదటి నుంచి ఎలక్ట్రిక్ బస్ టెండర్ల వ్యవహారం.. ఓ గూడుపుఠాణిలా సాగుతోందన్న విమర్శలకు తాజా చర్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.