హైకోర్టులో మూడు, నాలుగు సార్లు వ్యతిరేక తీర్పు వచ్చింది. ఓ సారి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అయింది. అయినా సరే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదంతా.. ప్రభుత్వ భవనాలపై రంగుల విషయంలోనే. ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించాలని… హైకోర్టు ఆదేశించింది. దానికి ఇరవై ఎనిమిదో తేదీ వరకే గడువు ఇచ్చింది. ఖచ్చితంగా ఒక్కరోజు ముందు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది ఏపీ సర్కార్. గతంలో హైకోర్టు.. సుప్రీంకోర్టు చెప్పినా రంగుల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. పాత వైసీపీ రంగులకు మరో రంగు కలిపి కొత్త జీవో ఇచ్చింది. ఇదంతా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కోర్టు తేల్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలన్నింటికీ వైసీపీ రంగులు వేశారు. దానిపై వివాదం చెలరేగింది. హైకోర్టు.. ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులు వేయకూడదని తీర్పు చెప్పింది. దానిపై ఓ సారి సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు కూడా.. హైకోర్టు తీర్పును సమర్ధించింది. అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం.. ఈ విషయంలో మొండి పట్టుదల ప్రదర్శిస్తోంది. ఆ రంగులు తీసి వేయకూడదన్న లక్ష్యంతో ఉంది. అందుకే.. కోర్టులు మొట్టికాయలు వేసినా.. ఏదో విధంగా పిటిషన్ల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం.. వాటిపై కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇస్తే.. న్యాయస్థానాలకూ దురుద్దేశాలు ఆపాదించి మాట్లాడటం… తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో ప్రారంభమయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రంగుల విషయంలో కోర్టులు ఏ దశలోనూ చిన్న ఊరట కూడా ఇవ్వలేదు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని.. ఉన్నతాధికారులుక తెలిసినా.. వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇవ్వడం.. న్యాయపోరాటం చేయడం చేస్తున్నారు కానీ.. సరైన సలహాలను ప్రభుత్వ పెద్దలకు ఇవ్వలేకపోతున్నారంటున్నారు.