దావోస్‌లో బైజూర్ లెర్నింగ్ యాప్ నిర్వాహకులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులపై చర్చ జరిగిందని ప్రభుత్వ పీఆర్ టీం మీడియాకు సమాచారం ఇచ్చారు. లెర్నింగ్ డెలవప్మెంట్ సెంటర్ లాంటిది ఏదో డెలవప్ చేస్తారని కూడా చెప్పుకున్నారు.తీరా చూస్తే.. బైజూస్‌కు ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఎనిమిదో తరగతి చదువుతున్న వారందర్నీ బైజూస్‌కు అప్పగించడానికి శరవేగంగా ఒప్పందం చేసుకున్నారు.
2025లో సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులు చేసేందుకు సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇస్తామనని ముఖ్యమంత్రి ప్రకటించారు. దాదాపు 4.7లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం ప్రకటించారు. బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే ట్యాబ్ ద్వారా పాఠాలు చెబుతారు. ఆ ట్యాబ్ బైజూస్ ఇస్తుంది. అయితే ఈ ట్యాబ్‌లకే మాత్రమే ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించుకుంది.
పూర్తిగా బైజూస్‌కు విద్యార్థులను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను కూడా ముద్రిస్తామని సీఎం చెబుతున్నారు. వీడియోకంటెంట్ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు పెడతామని సీఎం ప్రకటించారు. మే 25న తొలి సమావేశం జరిగితే… వెనువెంటనే ఒప్పందం కుదుర్చుకున్నారని బైజూస్ ఓనర్ సంతోషపడ్డారు. ఇంత బిజినెస్ ఇస్తూంటే ఏ ఓనర్‌కు అయినా కావాల్సిందేముంది ?