సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించే బదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. సినిమాల కలెక్షన్ మొత్తం ముందుగా తమ ఖాతాలో పడేలా కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్న ఐఆర్సీటీసీ వెబ్ సైట్ తరహాలో ఏపీలో ఉన్న సినిమాహాళ్లు మొత్తానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఓ పోర్టల్ రూపొందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఐటీ సహా వివిధ విభాగాల నుంచి ఏడుగుర్ని సభ్యులుగా నియమించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31వ తేదీనే జీవో విడుదల చేసినప్పటికీ ఆన్లైన్లో పెట్టే విధానం లేకపోవడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విధానం అమలయితే ఇక టిక్కెట్ రేట్లు, బుకింగ్ సహా మొత్తం ప్రభుత్వంచేతుల్లోనే ఉంటుంది. ప్రొడ్యూసర్లు సినిమా తీయడం.. రిలీజ్ చేసుకోవడం వరకు మాత్రమే వారి చేతుల్లో ఉంటుంది. మిగతా ఆదాయం అంతా ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందో తెలియదు.. ఎలా చేస్తుందో తెలియదు.. . ఆ ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ రూపొందించినందుకు ఎంత కమిషన్ తీసుకుంటుందో తెలియదు.. వీటన్నింటినీ కమిటీ నిర్ధారిస్తుంది. సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తామని సమావేశానికి రావాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వెళ్లింది కానీ అపాయింట్ ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ కొత్త కొత్త సమస్యలు .. ఇబ్బందులు సృష్టించేలా మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రభుత్వ ఆలోచన సినిమా పరిశ్రమకు సంబంధించినది అయినా.. ఒక్కరంటే ఒక్కరికీ సినీ రంగంలో వారికి కమిటీలో చోటు ఇవ్వలేదు. అంటే వారికి సంబంధం లేకుండా వారి వ్యాపారాన్ని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ దానికి ఏపీ సీఎం జగన్ను పొగిడేసే చిరంజీవి లాంటి సినీ పెద్దలు ఈ ఉత్తర్వులపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.