తిరుమల తిరుపతి దేవస్థానం అంటే… శ్రీవారి తర్వాత అందరికీ గుర్తొచ్చేది డాలర్ శేషాద్రి. తెలియని వాళ్లు చాలా మంది ఆయనే ప్రధాన అర్చకుడని అనుకుంటారు. నిజానికి ఆయన సాదాసీదా ఉద్యోగి మాత్రమే. కానీ.. ఆయన పలుకుపడి రాష్ట్రపతి వరకూ ఉంటుంది. దశాబ్దాలుగా శ్రీవారి ఆలయంలో ఆయనదే హవా. పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేదు.. ఎవరొచ్చినా ఆయన ఉండాల్సిందే. కానీ.. ఇప్పుడు.. ఆయనకు గుడ్ బై చెప్పాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయి ఇంకా విధుల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. టీటీడీ రిటైర్డ్ సూపరిడెంట్ డాలర్ శేషాద్రిపై కూడా పూర్తి స్థాయిలో వేటు పడనుంది.
శ్రీవారి దర్శనం కోసం ప్రముఖులు ఎవరు వచ్చినా వారితో సన్నిహితంగా వ్యవహరిస్తూ.. జాతీయ స్థాయిలో పలకుబడి సంపాదించుకున్నారు. ఆ పలుకుబడిని ఉపయోగించుకునే 2006లో రిటైర్ అయినా ఇప్పటికీ పొడిగింపు తెచ్చుకుంటూ ఉన్నారు. గతంలో ఆయన పొడిగింపుపై కోర్టు కేసులు నమోదయ్యాయి. ఓ సారి డాలర్ శేషాద్రి నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై డాలర్ శేషాద్రి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు డాలర్ శేషాద్రికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆయన టీటీడీలో కొనసాగుతున్నారు. మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు, డాలర్ శేషాద్రి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు ఉంది.
టీడీపీ హయాంలో.. రమణదీక్షితులు గర్భగుడిలోకి తన మనవడిని తీసుకు వెళ్లారు… ఇది నిబంధనలకు విరుద్ధమని, చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, ఓ షోకాజ్ నోటీసును డాలర్ శేషాద్రికి పంపారు. ఆ తర్వాత నుంచే.. రమణదీక్షితులు ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అయితే..ఆలయం గురించి.. శ్రీవారి పూజల గురించి.. ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని.. టీటీడీ వర్గాలే చెబుతూంటాయి. ఆయన రాకపోతే… పూజాకైంకర్యాలు చేసే వారిలో చాలా మందికి కాళ్లూ చేతులూ ఆడవు. బ్రహ్మోత్సవాలు వ్యవహారాలు మొత్తం ఆయనే దగ్గరుండి చేస్తారు. మరి ఈ సారైనా.. అనుకున్నట్లుగా డాలర్ శేషాద్రిని తిరుమల నుంచి పంపేస్తారా..? లేక ఆయన పలుకుబడి ముందు ప్రభుత్వం మరోసారి తలొగ్గుతుందా..? వేచి చూడాలి..!