ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను 30 లక్షల మంది లబ్దిదారులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. పలు చోట్ల తక్కువ ధర ఉన్న భూములకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి సంగతేమో కానీ.. అగ్రిగోల్డ్ బాధితులు మాత్రం ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు పెడుతున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వేలం వేసి.. బాధితుల్ని ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం… ఆ సంస్థ భూముల్ని ప్రభుత్వమే కొనొచ్చు కదా.. అని సలహా ఇస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం భూముల రూపంలోనే ఉన్నాయి. ఏపీలో దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ అగ్రిగోల్డ్ కు భూములు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఆస్తుల జాబితా ప్రభుత్వం వద్ద ఉంది. వాటిని అమ్మడానికి ఆన్ లైన్ వేలం కూడా నిర్వహిస్తున్నారు. అయితే స్పందన ఉండటం లేదు. ఈ కారణంగా బాధితులకు మేలు చేయలేకపోతున్నారు.
ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు.. వేలం అవసరం ఏముందని… అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. సీఐడీ అధికారులను కలిసిన అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఇళ్ల పట్టాల పథకంలో కొనుగోలు చేయాలి, ఆ డబ్బుతో బాధితులకు న్యాయం చేయాలని వారు అందులో కోరారు. అగ్రిగోల్డ్ బాధితులను వార్డు వాలంటీర్ ద్వారా సమగ్ర లిస్టు తయారు చేసి గ్రామ సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పటికే వివిధ జిల్లాల్లో భూముల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లుగా భావిస్తున్నారు.
అగ్రిగోల్డ్ బాధితులు ఏపీలో పెద్ద ఎత్తున ఉన్నారు. రూ. 20, 30వేలు డిపాజిట్ చేసిన వారు లక్షల్లో ఉన్నారు. వారందరికీ ఎన్నికలకు ముందు జగన్ భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే రూ. 1150 కోట్లు ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్లో కూడా ప్రకటింంచారు. కానీ ఇవ్వలేకపోయారు. ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు మరో బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి సాయం చేస్తారో మాత్రం.. తెలియలేదు. కనీసం భూముల్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. కొంతమొత్తమైనా తమకు లభిస్తుందని… బాధితులు ఆశ పడుతున్నారు. ప్రభుత్వం ఇవ్వడం లేదు.. అలాగని చాన్స్ ఉన్నా భూముల్ని కొనడం లేదనే ఆవేదన బాధితుల్లో కనిపిస్తోంది.