పోలవరం టెండర్ల విషయంలో ఏపీ సర్కార్ హైకోర్టునే ధిక్కరిస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. రివర్స్ టెండర్లపై ముందుకు వెళ్లవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ.. టెండర్ షెడ్యూల్ను అప్లోడ్ చేశారు. కొద్ది రోజుల క్రితం పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులను చేపట్టవద్దని, నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగాలని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్రీ క్లోజర్ నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేపట్టొద్దని నవయుగకు ఏపీ జెన్ కో ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులపై నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఏపీ హైకోర్ట్ ను ఆశ్రయించింది. దీంతో హైకోర్టు రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లొద్దని ఆదేశిస్తూ స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ కి అప్పీల్ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీకి కేసును వాయిదా వేశారు.
అప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయదని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం.. మాత్రం.. కోర్టు తీర్పును లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులు, హైడల్ ప్రాజెక్ట్ కు కలిపి రూ. 4 , 987 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. టెండర్ నోటిఫికేషన్ ను ఆగస్టు 17వ తేదీనే జారీ చేశారు. కానీ కోర్టు కేసు కారణంగా అప్ లోడ్ చేయలేదు. సీఎం జగన్ విదేశాల్లో ఉండటంతో.. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయనిపుణులతో చర్చించి.. ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
టెండర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని .. ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హైకోర్టులో స్టేపై ఎలాంటి రిలీఫ్ లేకుండా… కోర్టు ఉత్తర్వులు ధిక్కరించేలా…ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు కేంద్రం.. ఇటు న్యాయస్థానాల్లోనూ ఎదురు దెబ్బలు తగులుతున్నా…పోలవరం రివర్స్ టెండర్ల విషయంలో..సీఎం ఎవర్నీ లెక్కచేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.