ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి,ఎస్ఈసీ మధ్య తొలి సమస్య అధికారుల బదిలీ దగ్గరే వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరవాత వ్యవస్థ పూర్తిగా ఎన్నికల సంఘంచేతుల్లోకి వస్తుంది. నిష్ఫాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆయన చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే.. రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అవుతుంది. ప్రభుత్వం అండ చూసుకుని అమలు చేయకపోతే భవిష్యత్లో అవి రిమార్కులుగా ఉండే అవకాశంఉంది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, ఏకగ్రీవాల్లో ఆరోపణల కారణంగా… కొంత మంది అధికారుల్ని ఎస్ఈసీ బదిలీ చేశారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో.. గుంటూరు,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీ, పలువురు సీఐలపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ .. సిఫార్సు చేశారు. వీటిని సీఎస్ అమలు చేయలేదు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కింద అధికారులంతా పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను 24 గంటల్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘించటం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆదేశాలను తిరస్కరించటం అవుతుంది. గతంలో ఎస్ఈసీ ఆదేశాలను అప్పటి సీఎస్ నీలం సహాని తిరస్కరించారు. అమలు చేయలేదు. ఎన్నికలు వాయిదా పడటం.. కోడ్ ఎత్తివేయడం వల్ల.. అధికారుల బదిలీ గురించి పెద్దగాఎవరూ పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు మళ్లీ కోడ్ అమల్లోకి వచ్చింది. తాను అప్పుడు చెప్పిన అధికారులను ఇప్పుడు బదిలీ చేయాలని..ఎస్ఈసీ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో… కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగామారింది. అసలుఎన్నికల ప్రక్రియే వద్దని ఆయన లేఖలు రాస్తున్నారు. ఆయన పేరుతో జారీ అవుతున్న జీవోల్లో.. రాజకీయభాష ఉంటోంది. ఇలాంటిపరిస్థితుల్లో ఆయన కూడా ఎస్ఈసీ ఆదేశాలను పాటించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం… ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న చర్చ మాత్రం.. అధికారవర్గాల్లో నడుస్తోంది.