ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విషయంలో అయినా ముందూ వెనుకా చూసుకోకుండా ఆవేశపడటం.. ఆనక నాలిక్కరుచుకోవడం కామన్‌గా జరుగుతోంది. తాజాగా అమరావతి భూముల విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హడావుడిపై సుప్రీంకోర్టుకు వెళ్లి .. ఇప్పుడు మళ్లీ నాలిక్కరుచుకుంది. తాము హైకోర్టులోనే విచారణ కోరుకుంటున్నామని.. తమ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదన.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరికి సుప్రీంకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అసలు..హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వచ్చి.. ఇప్పుడు మళ్లీ హైకోర్టులోనే విచారణకు వెళ్తామని ఏపీ సర్కార్ ఎందుకు అంటుందో.. లాయర్లకు సైతం అంతబట్టడం లేదు.
ఏపీలో వైసీపీ వచ్చిన తర్వాత అమరాతి భూముల్లో ఏదో జరిగిందని నిరూపించాలన్న తాపత్రయంలోనే ఉంది. ఇందు కోసం.. ఎలాంటి అవకతవకలు బయటపడకపోయినా.. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ప్రభుత్వం సీఐడీ, సిట్ లను దర్యాపు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. వెంటనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై గత విచారణలో కౌంటర్‌కు సమయం అడిగిన ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఇప్పుడు.. అసలు పిటిషన్ ఉపసంహరించుకుంటామని విజ్ఞప్తి చేశారు. హైకోర్టులోనే ఈ కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగాలని.. అందుకే పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెప్పుకొచ్చారు.
గతంలో తాము సీబీఐ దర్యాప్తు కోసం లేఖ రాశామని కానీ దర్యాప్తు చేయలేదని.. సీఐడీ..సిట్ నియమించామని… సీబీఐతో దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదని వాదించారు. హైకోర్టు తాత్కాలిక తీర్పుపై మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించామని .. దీనిపై పూర్తిస్థాయిలో సుప్రీంలోనే విచారణ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే ఇదంతా కల్పితమైన .. రాజకీయ కుట్రపూరిత కేసు అని.. ఈ వ్యవస్థ ప్రతీకారం ఇంకా ఎన్నాళ్లంటూ ఏపీ ప్రభుత్వంపై దమ్మాలపాటి తరపు న్యాయవాది హరీష్ సాల్వే మండిపడ్డారు. ఈ కేసు విచారణ రెండు వారాల తర్వాత జరగనుది.