హామీ ఇచ్చినట్లుగా అంగన్ వాడీలు తమకు జీతాలు పెంచాలని ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వారిని చర్చలకు పిలిచి… ప్రభుత్వం బెదిరిస్తోంది. జీతాలు మాత్రం పెంచేది లేదని అంటోంది. వచ్చే ప్రభుత్వం పెంచుతుందని చచ్చు సలహాలు ఇస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వ సలహాదారుల పేరుతో కోట్లు నెలకు దోచి పెడుతోంది. వారిలో ఒక్కరూ సలహాలివ్వరు. ఇచ్చినా తీసుకునే వారు లేరు.
ఇటీవలే ఇద్దరు, ముగ్గురు సలహాదారుల్ని లక్షల జీతాలతో నియమించారు. అసలు వారికెందుకు లక్షలు ఇవ్వాలి ?. లక్షల మంది నిరుపేద చిన్నారు ఆరోగ్యాన్ని కాపాడుతూ.. వికాసానికి ప్రయత్నిస్తున్న అంగన్ వాడీలకు జీతాలు ఎందుకు పెంచరు అన్నది ప్రాథమికంగా వస్తున్న ప్రశ్న. ప్రజల కోసం పని చేసే వారికి జీతాలు పెంచకుండా.. వైసీపీ కోసం.. పని చేస్తూ.. జగన్ రెడ్డికి భజన చేసే వారికి లక్షల జీతాలు ఇవ్వడం … సాక్షి పత్రిక కోసం వందల కోట్లు నిధులు మళ్లించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆర్బాటాలకు..తమ పార్టీ ప్రచారాలకు ప్రజాధనం ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ నిజంగా ప్రజల కోసం ఉపయోగించడం లేదని ఎవరికైనా తెలుస్తుంది. సలహాదారుల పేరుతో.. సొంత కులపోళ్లకు.. పార్టీ కోసం పని చేసే వారికి .. దోచి పెడుతున్నారు. కోర్టులను కూడా లెక్క చేయడంలేదు. ప్రజల్లో తిరుగుబాటుకు ఈ తెంపరితనం కూడా ఓ కారణమే.