ఏపీలో ఇప్పుడు మేడిన్ ఆంధ్రా బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారు. అవన్నీ ఎవరివో అందరికీ తెలుసు. నాలుగేళ్ల పాటు అవే బ్రాండ్లు అమ్మారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు. మొత్తం నగదు వ్యవహారాలు నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో .. ఇప్పుడిప్పుడే మెల్లగా .. డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. మొదట పదకొండు దుకాణాల్లో ప్రారంభించారు. రెండు నెలల్లో అన్నిచోట్లా పెడతామంటున్నారు.
అంతే కాదు ఇప్పుడు వర్జినల్ బ్రాండ్స్ కూడా అమ్ముతామని లీకులు ఇస్తున్నారు. ఏపీ మద్యం బ్రాండ్లపై ఉన్నన్ని ఆరోపణలు ఎక్కడా లేవు. ఎప్పుడైనా తీవ్రంగా వచ్చినప్పుడు ఇదిగో పాత బ్రాండ్లు అంటూ ప్రభుత్వ వర్గాలు ఊరిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటికీ అమ్మడం లేదు. పాత బ్రాండ్లు.. సొంత బ్రాండ్లే అమ్ముతున్నారు. పైగా గ రేట్లు కూడా ఎక్కువే. తొలి నుంచి కూడా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇదే తరహా బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. రోజువారీ కూలీలు దొరికిన బ్రాండ్లతో సరిపెట్టుకుంటున్నారు.
ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాల విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు నిర్ణ యించుకున్నట్లు తెలిసింది. మద్యం విషయంలో మందు బాబుల అసంతృప్తిని తగ్గించడానికి పాత బ్రాండ్లను కూడా తగినంతగా సరఫరా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు మీడియాకు లీక్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు కల్తీ మద్యం ఆరోపణలు వస్తే.. ఇబ్బందని.. ఏడాది ముందే.. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెస్తే.. ప్రజలు మర్చిపోతారని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. అయితే పాత బ్రాండ్లు తీసుకొస్తే తమ సొంత ఆదాయం పడిపోతుందని.. దీనికి వైసీపీ పెద్దలు సిద్ధంగా ఉంటారా అన్నది కీలక సందేహం.