వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం అభయహస్తం అనే పధకం ప్రారభించారు. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళల వద్ద నుంచి ఏడాదికి రూ.365 ప్రీమియం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది. మొత్తం ఎల్ఐసీకి కడతారు. ఎల్ఐసీ 60వ సంవత్సరం నుంచి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛన్ ఇస్తోంది. ప్రీమియం చెల్లించే సమయంలో సభ్యురాలు మరణిస్తే బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. బీమాతో పాటు, ఫించను కూడా లభించే ఈ పథకాన్ని ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆపేసింది.
అటు డ్వాక్రా మహిళలు.. ఇటు ప్రభుత్వం కలిపి కట్టిన మొత్తం ఎల్ఐసీ వద్ద కార్పస్ ఫండ్‌గా ఉన్న రూ. 2,118 కోట్లను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. దీంతో పథకం ఆపేస్తున్నట్లుగా ఎల్ఐసీ పేపర్ ప్రకటన జారీ చేసింది. తమకు సంబంధం లేదని … క్లెయిమ్‌ల కోసం తమ వద్దకు రావొద్దని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం నాలుగు లక్షల మందికిపైగా పింఛన్ ఇస్తున్నారు. ఇవన్నీ ఆగిపోనున్నాయి. అయితే ఇప్పుడు కార్పస్ ఫండ్ నిధులు ప్రభుత్వానికి కావు. డ్వాక్రా మహిళలవి. ఇప్పుడు ప్రభుత్వం డ్రా చేసుకున్న నిధులు డ్వాక్రా మహిళలకు ఇస్తారా లేక సొంతానికి వాడుకుంటుందా అన్నది ఇప్పుడు కీలకం.
ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆర్డినెన్స్, జీవోలను రహస్యంగా ఉంచింది. దీంతో ఎల్ఐసీ ప్రకటిస్తే తప్ప స్పష్టత లేదు. అయితే అభయ హస్తం పథకం కొనసాగుతుందని..సెర్ఫ్ ద్వారా బీమా క్లెయిమ్‌లను పరిష్కరిస్తామని చెబుతున్నారు. కానీ గతంలో చంద్రన్న బీమాను రద్దు చేసి తీసుకొచ్చిన వైఎస్ఆర్ బీమా తరహాలోనే ఇస్తామన్న ప్రకటనలకే పరిమితమవుతారు కాకనీ ఇవ్వరని డ్వాక్రా మహిళలు అనుమానంతో ఉన్నారు.