ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. అదేమిటంటే ఆర్థిక పరమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్లే చెబుతున్నారని ముగ్గురు అధికారులపై వేటు వేశారు. కానీ ఆగడం లేదు. ఉత్తర్వులు వెబ్సైట్లో పెట్టడం మానేశారు. అయినా ఆగడం లేదు. చిన్న చిన్న ఆర్థిక పరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి టెన్షన్ పట్టుకుంది. ఎలా బయటకు వెళ్తున్నాయో తెలియక జుట్టు పిక్కుంది. ఇక మరింత కట్టడి చేయాలనుకుంది .. ఇప్పుడు కొత్త ఆదేశాలను నోటి మాట ద్వారా జారీ చేసింది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేటప్పుడు కింది స్థాయి అధికారులు ఉండకూడదు… ఓ మాదిరి ఉద్యోగుల దగ్గర ఆర్థిక పరమైన విషయాలు చర్చించకూడదు.. వివిధ సమావేశాల్లో అధికారులు రూపొందించే ప్రజెంటేషన్లు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతోంది. సమావేశాలు ముగిశాక ప్రజెంటేషన్ల వివరాలు ఎవరికీ అందుబాటులో లేకుండా చూడాలని నిర్ణయించింది. వాస్తవానికి సీఎంఓలో జరిగే వివిధ సమీక్షా సమావేశాల్లో ఆర్థిక అంశాలపై చర్చించొద్దని అధికారులందరికీ వ్యక్తిగత ఆదేశాలు వెళ్లాయి. నేరుగా సీఎంతో లేదా సీఎంఓలోని అధికారులతో మాత్రమే చర్చించాల్సిందిగా స్పష్టం చేశారు. అయినా లీకులు మాత్రం తగ్గట్లేదు.
అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి వివరాలన్నీ ఏపీ సెక్రటేరియట్ నుంచి కాకుండా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, పీఏసీ, రిజర్వు బ్యాంక్ వంటి వివిధ సంస్థల నుంచి ఈ వివరాలన్నీ బయటకు వస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ నుంచి కూడా ఎలాంటి సమాచారం బయటకు రాకుండా ఉండాలంటే… వారికి కూడా సమాచారం పంపేయడం ఆపేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత కట్టడి చేసినా ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇంటర్ లింక్‌గా ఉంటాయని బయటకు తెలియకుండా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టే దాచుకుంటున్నారని విపక్షాలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.