పోలవరం ప్రాజెక్ట్ పాత కాంట్రాక్టర్ను గెంటేసి.. కొత్త కాంట్రాక్టర్ను తీసుకొచ్చే పనులను ఏపీ సీఎం జగన్ దాదాపుగా పూర్తి చేశారు. రివర్స్ టెండరింగ్ నిర్వహించేసి.. మేఘా కంపెనీ రూ. ఎనిమిది వందల కోట్లు తక్కువ చేస్తూందంటూ ప్రకటనలు చేసేశారు. అయితే.. ఆ టెండర్ల ప్రక్రియ ఇంత వరకూ .. కేంద్రానికి చేరలేదట. ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్నే… స్పష్టం చేశారు. అసలు పోలవరంలో ఏం జరుగుతుందో.. తమకు తెలియడం లేదని.. రివర్స్ టెండర్లు జరిగాయో లేదో కూడా.. తమకు తెలియదని.. కేంద్రమంత్రి స్పష్టం చేసారు. పోలవరం ప్రాజెక్టును.. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన బీజేపీ నేతలు.. కేంద్రమంత్రిని కలిసి నివేదికను అందించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం బీజేపీ నేతల వంతయింది.
పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. నిధులన్నీ కేంద్రమే ఇస్తుంది. ఇందు కోసం పోలవరం ప్రాజెక్ట్ అధారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా… పూర్తిగా.. పీపీఏ అనుమతితోనే జరగాలి. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం పీపీఏను పూచికపుల్లలా తీసి పడేసింది. ఇష్టారాజ్యంగా తీసుకుని కాంట్రాక్టర్లను తరమేయడం.. రివర్స్ టెండర్లు పిలవడం.. నిబంధనలు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవడం.. వంటి వివాదాస్పద విషయాలతో.. పని పూర్తి చేసింది. ఇంతా చేసి.. తాము రివర్స్ టెండరింగ్ పూర్తి చేశామని.. మేఘా ఇంజినీరింగ్ సంస్థకు టెండర్లు కట్టబెట్టబోతున్నామన్న సమాచారాన్ని మాత్రం.. ఇప్పటి వరకూ కేంద్రానికి పంపలేదు. అలా పంపితేనే.. మేఘా పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏపీ సర్కార్.. ఈ వివరాలను.. ఏపీలోనే ఉంచుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ సర్కార్ “రివర్స్” వ్యవహారాన్ని సొంత పెత్తనం అనుకోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు కోర్టులో రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై కేసు ఉంది. పోలవరం ప్రాజెక్ట్ మిగిలిపోయిన పనులపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కానీ.. విద్యుత్ ప్రాజెక్టుకు కలగలపి.. టెండరింగ్ ఇవ్వడం వల్ల.. సమస్యలు వస్తున్నాయి. నవయుగ కంపెనీ వేసిన పిటిషన్ పై స్టే ఇవ్వడంతో… కోర్టు నిర్ణయం కీలకంగా మారింది. కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఆమోదం కోసం.. కేంద్రానికి పంపాలని.. ఏపీ సర్కార్ అనుకుంటున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ.. న్యాయపరమైన వివాదాలు.. ఇప్పుడల్లా తేలుతాయా.. అన్నది అసలు సందేహంగా మారింది.