బైజూస్ కంటెంట్‌ను ఎలాగైనా విద్యార్థులకు అంటగట్టాలని గట్టి ప్రయత్నంతో ఉన్న ప్రభుత్వం టీచర్లను వేధించడానికి కూడా వెనుకాడటం లేదు. జైజూస్ ఇస్తామన్న ట్యాబ్‌లు ఇవ్వలేదు. నెలలకు నెలలు గడిచిపోతున్నాయి. కానీ పిల్లల స్మార్ట్ ఫోన్లలోనే బైజూస్‌ను డౌన్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఎక్కడ నుంచి వస్తాయన్న కనీస ఆలోచన చేయలేదు. వారి తల్లిదండ్రుల ఫోన్లలో అయినా డౌన్ లోడ్ చేయాల్సిందేనని ఆదేశాలిచ్చింది. ఈ బాధ్యత టీచర్లకు ఇచ్చింది.
కానీ ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారంతా.. స్మార్ట్ ఫోన్లు వాడతారన్న గ్యారంటీ లేదు. ఫోన్ ఉన్నా డేటా ఉంటుందన్న గ్యారంటీలేదు. ఇలాంటి పరిస్థితుల కారణంగా విద్యార్థుల ఫోన్ నెంబర్లను టీచర్లు రిజిస్టర్ చేయలేకపోయారు. ఇదే అదనుగా.. టీచర్లందరిపై ప్రభుత్వం దండయాత్ర ప్రారంభించింది. బైజూస్ యాప్ డౌన్ లోడ్ కోసం.. ఫోన్ నెంబర్లు సేకరించలేదన్న కారణంగా వందల మంది టీచర్లకు నోటీసులు జారీ చేసింది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోకుండా ఇలా టీచర్లపై ప్రతీ దానికి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయడం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.
ప్రభుత్వం రూ. ఐదు వందల కోట్లకుపైగా బైజూస్‌కు కట్టాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ట్యాబ్‌లు వస్తాయని ప్రకటించారు. మొదట అమ్మఒడికి బదులు ల్యాప్ ట్యాప్ ఇస్తామన్నారు.. తర్వాత అదీ లేదు. తర్వాత ఉచితంగా బైజూస్ ట్యాబ్ అన్నారు. ఇప్పుడు ఇంకా దారుణంగా విద్యార్థుల సొంత ఫోన్లలోనే బైజూస్ ఉండాలంటున్నారు. ట్యాబ్‌ల గురించి మాట్లాడటం లేదు. అసలు టీచర్లు ఎప్పటిలాగే పాఠాలు చెబుతూంటే.. బైజూస్ కంటెంట్ ఎందుకని వస్తున్న ప్రశ్నలకూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతోంది.