చరిత్రలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అసెంబ్లీకి రాకుండా… రాజ్‌భవన్ నుంచే… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ..తమ తమ సభల్లో వారి వారి సీట్లలో కూర్చుని ప్రసంగాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారు. మూడు రాజధానుల అంశం కీలకం అని.. అది ప్రస్తుతం శాసన ప్రక్రియలో ఉందని గవర్నర్ ప్రకటించారు. ప్రభుత్వం సాధించిన విజయాలన్నింటినీ గవర్నర్ సభ్యుల ముందు ఉంచారు. ప్రజలకు ఇచ్చిన 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చామని..39 హామీలు పరిశీలనలో ఉన్నాయని ప్రకటించారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా అమలు చేశామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మందికి ఏడాదిలో రూ.42 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు.
అభివృద్ధిలోనూ ఏపీ దూసుకెళ్తోందని రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం .. పారిశ్రామిక రంగంలో 5శాతం..వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి నమోదయిందని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది కంటే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి చెందిందన్నారు. ఇంగ్లీష్ మీడియానికి 97శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. 15,700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పిస్తున్నామని.. మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధిచేస్తామన్నారు. నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో చేయబోతే పనుల వివరాలను కూడా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు వైఎస్ఆర్ జనతా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రాజెక్టుల విషయంలోనూ గవర్నర్ ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు. 2021 డిసెంబర్‌లోగా పోలవరం పూర్తి చేస్తామని.. వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశామని ప్రకటించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవులను నిర్మిస్తున్నామని.. మూడేళ్లలో రూ.3200 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం తేబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే.. గవర్నర్ ప్రసంగంలోఒక్కటంటే.. ఒక్క నిజం లేదని అన్ని అబద్దాలేనంటూ టీడీపీ వాకౌట్ చేసింది.