ప్రపంచంలో సౌతాఫ్రికా తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అధికారికంగా మూడు రాజధానులు వచ్చాయి. ఈ మేరకు.. ప్రభుత్వం పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో.. ఏపీలో మూడు రాజధానుల వ్యవస్థ అమల్లోకి రానుంది. అలాగే.. సీఆర్డీఏ చట్టం కూడా రద్దు అయింది. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమంటూ.. విపక్ష పార్టీ నేతలు ఎన్ని లేఖలు రాసినా.. గవర్నర్ పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి.. న్యాయసలహా తీసుకుని… ఆమోదించారు. వాస్తవానికి ఆ బిల్లులు ఇప్పటికీ సెలక్ట్ కమిటీలో ఉన్నాయి. కోర్టుల్లో ఉన్నాయి. ఈ రెండు బిల్లులు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమనే చెబుతున్నారు. అయితే గవర్నర్ ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు.
గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించినా.. .. రాజ్యాంగ పరంగా అనేక సందేహాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… ఆ బిల్లులు ఇప్పటికే మండలిలో సెలక్ట్ కమిటీలో ఉన్నాయి. స్వయంగా.. మండలి చైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపిన తర్వాత.. మరెవరూ ప్రశ్నించడానికి లేదు. ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయని ప్రభుత్వమే హైకోర్టులో తెలిపింది. ఇలాంటి సమయంలో… గవర్నర్ సంతకం చేసినా న్యాయసమీక్షలో తేలిపోతుందనే వాదన ఉంది. ఎస్ఈసీ పదవి కాలాన్ని తగ్గిస్తూ.. ఇలా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కోర్టులు కొట్టి వేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా.. ఈ బిల్లుల కేంద్రంగా జరుగుతున్న రాజకీయంతో దీని వెనుక బీజేపీ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా.. అమరావతిని సపోర్ట్ చేస్తున్న కన్నా లక్ష్మినారాయణను రాత్రికి రాత్రే మార్చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన కొత్త అధ్యక్షుడు ఆ తర్వాత ఏపీ రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని ప్రకటించారు. ఏపీ రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ… ప్రకటించిన సుజనా చౌదరి ప్రకటనను.. రెండు సార్లు పేరు పెట్టి మరీ బీజేపీ ట్విట్టర్ అకౌంట్లో ఖండించింది. దీంతో.. గవర్నర్.. బిల్లుల ఆమోదానికి ముందు ఢిల్లీ స్థాయిలో.. పెద్ద లాబీయింగ్ జరిగిందన్న అభిప్రాయం అంతటా ఏర్పడింది.
అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. మార్చబోమని ఎన్నికల్లో… ప్రజలను నమ్మించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతిపై ఓ సామాజికవర్గం ముద్ర వేసింది. అక్కడ రాజధాని కడితే.. ఒక్క వర్గమే బలపడుతుందని ఆరోపిస్తూ.. సమగ్ర అభివృద్ధి చేస్తామంటూ.. మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారు. భూములు ఇచ్చిన రైతులు ఈ రాజకీయంలో అన్యాయం అయిపోయారు.