ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. ప్రదానితో పాటు రాష్ట్రపతితోనూ సమావేశం కానున్నారు. ఇంత హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారని..ప్రధానితో భేటీ అవ్వాల్సిన అవసరం ఏమిటన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌కు పీకే రిపోర్టు ఇచ్చినట్లుగా బయటకురావడం ఏపీలోనే కాదు.. ఢిల్లీ రాజకీయవర్గాల్లోనూ కలకలం రేపింది. తెర వెనుక ఏం జరుగుతుందన్నదానిపై బీజేపీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితిపైనా ఢిల్లీలో సమాలోచనలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి అప్పుల వివరాలు ఇవ్వడానికి ఏపీ సర్కార్ వెనుకాడుతోంది. గవర్నర్ పేరు మీదనే అప్పు చేసిన వైనం కూడా ఇంకా పేపర్‌పైనే ఉంది. పొరుగు దేశాలన్ని అప్పుల ఊబిలో చిక్కుకుని సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాల అప్పులను కూడా ఓ కంటకనిపెట్టి ఉండాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే గవర్నర్ నివేదికను కోరినట్లుగా చెబుతున్నారు.
ఏపీ గవర్నర్ అధికారిక పనుల మీద ఢిల్లీ వెళ్లడం అరుదుగానే ఉంటుంది. సమావేశాలు ఉన్నప్పుడు లేకపోతే.. ప్రత్యేకంగా హోంశాఖ నుంచి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే వెళ్తారు. తెలంగాణ గవర్నర్ ఢిల్లీ పర్యటనల తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీ గవర్నర్ పర్యటన కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌తో పోరాటం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది.