ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కేంద్రం ఢిల్లీకి పిలిపించిందని… కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాని దానికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. ఢిల్లీ నుంచి కూడా ఏపీ గవర్నర్‌ను పిలిచినట్లుగా సంకేతాలు రాలేదు. దీంతో గవర్నర్‌ను ఢిల్లీ పర్యటన అన్నది ఊహాగానమేనని చెబుతున్నారు. సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ పూర్తయిన తర్వాత… కాసేపటికే ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు. అసలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. ఎందుకు సీఎం జగన్ వివరణ ఇవ్వగానే ఆమోద ముద్ర వేశారన్నది సస్పెన్స్‌గానే మారింది. ఆ సమయంలోనే గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచారనే ప్రచారం ప్రారంభమయింది.
సాధారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక బీజేపీ రాజకీయంగా పోరాటం చేయాలనుకున్న రాష్ట్రాల్లో అయితే.. తామే ముఖ్యమంత్రులం అన్నట్లుగా గవర్నర్లు.. లెఫ్ట్ నెంట్ గవర్నర్లు వ్యవహరిస్తూ ఉంటారు. బెంగాల్ , ఢిల్లీల్లో అదే జరిగుతోంది. అయితే.. బీజేపీతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు… ఇతర చోట్ల గవర్నర్లు కాస్త సైలెంట్ గా ఉంటారు. అయితే సైలెంట్‌గా ఉండటం వేరు.. ప్రభుత్వం ఏం చేసినా..సహకరించడం వేరు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్… రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల ఉల్లంఘిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ఆమోద ముద్ర వేస్తున్నారు. తరవాత కోర్టుల్లో కొట్టి వేసినా దులిపేసుకుంటున్నారు.
ఈ క్రమంలో బిశ్వభూషణ..బీజేపీ నేతల ఆదేశాల కన్నా.. ఎక్కువగా ఏపీ ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగానే పని చేస్తున్నారన్న అభిప్రాయం.. బలపడింది. ఆయనపై.. ఏపీ బీజేపీ నేతలు.. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీకి పిలుపంటే.. ఆయనకు క్లాస్ పీకడమో..లేకపోతే.. కొత్త వారిని నియమించే ప్రక్రియకు గ్రౌండ్ వర్క్ చేయడమో అని అనుకున్నారు. కానీ అధికారికంగా ఆయన ఢిల్లీ పర్యటన మాత్రం ఇంత వరకూ ఖరారు కాలేదు.