గవర్నర్ కార్యదర్శి సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్‌ను ఆ స్థానంలో నియమించింది. కానీ సిసోడియాకు మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవల గవర్నర్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. వారికి అపాయింట్మెంట్ ఎవరు ఇప్పించారో అని ఆరా తీసి చివరికి సిసోడియాను బలి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సిసోడియాను గవర్నర్ దగ్గర ప్రభుత్వ పెద్దలే అత్యంత నమ్మకస్తుడిగా భావించి నియమించారు. దీనికి కారణం అప్పట్లో స్థానిక ఎన్నికల విషయంలో ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు పదే పదే ఫిర్యాదులు చేస్తూండటంతో వాటి గురించి రహస్య సమాచారం తెలుసుకోవడానికి ఆయనను నియమించారు.
సిసోడియా తప్పుడు పనులు చేస్తున్నారని.. గవర్నర్‌కు రాసిన లేఖలను లీక్ చేస్తున్నారని.. హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ కూడా వేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేయగా.. అందులో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీతో ప్రివిలేజ్ నోటీసులు ఇప్పించారు. వీటికి ఘాటుగా సమాధానం ఇచ్చిన నిమ్మగడ్డ.. అసలు తాను గవర్నర్‌కు రాసిన లేఖలు లీక్ కావడంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. .మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గవర్నర్ హరిచందన్‌కు తాను చేసిన ఫిర్యాదు లేఖ ప్రభుత్వంతో పాటు ఇతరులకు గవర్నర్ కార్యదర్శి సిసోడియా లీక్ చేశారని నిమ్మగడ్డ భావించారు. ఈ అంశంపై నిమ్మగడ్డ సీబీఐ దర్యాప్తు కోరారు.
ఈ అంశం ప్రస్తుతం ఇంకా పిటిషన్ పరిష్కారం కాలేదు. అంతే కాదు సిసోడియా విపక్ష నేతలకు అపాయింట్ మెంట్లు రాకుండా .. చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని చెబుతూంటారు. కొన్ని ముఖ్యమైన అంశాలు గవర్నర్ దృష్టికి పోకుండా ఉండటంలోనూ ప్రభుత్వ సూచనలు పాటించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని చేసినా చివరికి ఉద్యోగులకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఖరారు కావడంలో సహకరించాన్న కారణంతో ఆయనపై బదిలీ వేటు వేసి.. పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టింది ప్రభుత్వం.
ఐఏఏస్ అధికారులను ఇలా ఇష్టారీతిన వాడుకోవడం.. చివరికి ఏ ఒక్క పని అయినా చేయేకపోతే బదిలీ వేటు వేసి.. బెదిరించడం రివాజుగా మారింది. అసలు వైసీపీ గెలవక ముందే ఆ పార్టీ పెద్దలు చెప్పినట్లుగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ పదవి నుంచి అవమానకరంగా పంపారు… ఇక సిసోడియా ఎంత అనే గుసగుసలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి.