ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేకహోదా నిధులు ఇస్తున్నామని.. ఇప్పటికి రూ. పదహారు వేల కోట్ల వరకూ ఇచ్చామని కేంద్రమంత్రి పంకజ్ చౌధురి పార్లమెంట్లో ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రత్యే క ప్యాకేజీలో చెప్పినట్లుగా ఇవ్వడం లేదని గత ప్రభుత్వం వాటిని తీసుకోలేదు. తర్వాత హోదానే కావాలని పట్టుబట్టింది. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. హోదా ఇచ్చేది లేదని చెబుతోంది. అయితే ఈ ప్రభుత్వం ప్రత్యేకహోదా కు బదులుగా ప్యాకేజీ తీసుకుంటున్నట్లుగా కేంద్రమంత్రి చెప్పారు. అంటే… ప్యాకేజీకి అంగీకరించేనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అదే జరిగితే కేంద్రం భవిష్యత్లో కూడా ప్రత్యేక హోదా అనే ప్రస్తావన కూడా తీసుకు రాదు. హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చాం కదా అన్న వాదన వినిపిస్తుంది.ప్రత్యేకహోదాను అడుగుతూనే ఉంటామని చెప్పే ఏపీ సీఎం జగన్ ఎప్పుడు అడుగుతారో స్పష్టత ఉండటం లేదు. ఏదో సమావేశం జరిగినప్పుడు.. విభజన హామీల ముసుగులో దాన్ని కూడా దాచి పెట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ప్రత్యేకంగా హోదా కోసం పోరాడింది లేదు. కేంద్రం ఫుల్ మెజార్టీ ఉందని.. జగన్ చెబుతూ ఉంటారు. ఫుల్ మెజార్టీ ఉంటేనే కేంద్రంలో ఉంటారు. హోదా విషయంలో అన్ని పార్టీలు ప్రజల్ని పూర్తి స్థాయిలో మభ్య పెడుతున్నాయి.
ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఆ పని చేస్తున్నట్లుగా ఉంది. హోదాకు బదలుగా ప్రకటించిన ప్యాకేజీ నిధులను ఏపీ సర్కార్ తీసుకుని ఉంటే మాత్రం.. హోదాకు ద్రోహం చేసినట్లుగానే భావిస్తారు. ఈ విషయంలో వైసీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పార్లమెంట్లో కేంద్రం చెప్పిన దానికి … అసలు నిజాలేంటో వైసీపీ చెప్పాల్సి ఉంది. మసిపూసి మారేడు కాయ చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. రాష్ట్రానికి నష్టం తప్ప.