ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలుపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసిన మంత్రి రాంప్రసాద్… ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని వెల్లడించారు.
ఇప్పటికే ఆర్టీసీ బస్సులో రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు..? మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ అమలు చేస్తే ప్రభుత్వం ఎంత భారం పడుతుంది..? అనే విషయాలపై అధికారులు నివేదిక రెడీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసిన మొదట్లో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిందని ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ స్కీమ్ అమలు చేసేలా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.