ఇంటలిజెన్స్ మాజీ చీఫ్… సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధపడలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. నాన్చి..నాన్చి.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఆరో తేదీన ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తీరును ముందుగానే ఊహించిన ఐపీఎస్ వెంకటేశ్వరరావు.. ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. తన వాదన వినకుండా.. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవొద్దని కోరారు.
టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కలేదు. జీతమూ అందడం లేదు. వెయిటింగ్లో పెట్టినన్ని రోజులు పెట్టి తర్వాత అవకతవకలకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై ఆయన క్యాట్‌కు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్‌ను… హైకోర్టు కొట్టి వేసింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ… సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు పక్కన పెట్టింది.
ఏబీని విధుల్లోకి తీసుకోవాలని మే 22వ తేదీన హైకోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకూ ప్రభుత్వం సైలెంట్‌గానే ఉంది. ఏబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయబోతున్నారని.. ఉన్నతాధికారవ ర్గాల్లో ప్రచారం ప్రారంభమవగానే… సుప్రీంకోర్టులో సవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. మరికొంత కాలం… ఏబీకి పోస్టింగ్… జీతం ఇవ్వకుండా… ఉండవచ్చని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు స్టే ఇస్తే… ఏబీకి ఇబ్బందే .. లేకపోతే.. ఖచ్చితంగా ఏపీ సర్కార్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.