ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని.. ఆందోళనలను.. నిరసనలను అణిచివేయడానికి దారుణమైన పద్దతుల్ని ఎంచుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. సంఘవిద్రోహశక్తులను అణిచివేయడానికి ఉపయోగించే… ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్.. పీడీ యాక్ట్‌ను.. అమలులోకి తీసుకు వచ్చింది. ఇది రాజధాని మార్చవద్దని ఆందోళనలు చేస్తున్న చోటనే కాదు.. కొత్తగా రాజధాని పెట్టాలనుకుంటున్న విశాఖపట్నంలోనూ.. అమలులోకి తీసుకు వస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిజానికి పీడీ యాక్ట్ జాతీయ భద్రతా కోణంలోనే.. 1980లో చేశారు. అప్పట్నుంచి.. ఈ యాక్ట్‌ను…. ప్రజాందోళనలు, రాజకీయ ఉద్యమాలపై ప్రయోగించిన ఘటనలు చాలా అరుదు.
రౌడీషీటర్లు.. ఇతర సంఘ విద్రోహశక్తులుగా భావించే వారిని.. కారణం లేకుండా అదుపులోకి తీసుకునే అవకాశాన్ని.. ఈ పీడీయాక్ట్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడీ చట్టాన్ని.. అమరావతి రైతులపై ప్రయోగించి.. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారందర్నీ అరెస్ట్ చేసి.. బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. లేకపోతే.. ఇప్పటికిప్పుడు.. ఈ చట్టాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ నెల ఇరవయ్యో తేదీన అసెంబ్లీ సమావేశం పెడుతోంది. పెద్ద ఎత్తున నిరసనలకు.. రాజధాని రైతులు.. విపక్ష పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. వీటన్నింటినీ నిర్వీర్యం చేసేందుకు.. ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యనేతలందరిపై పీడీయాక్ట్ ప్రయోగించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రైతులను ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులను.. మరొకటని.. వైసీపీ నేతలు.. తీవ్రంగా అవమానిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సంఘవిద్రోహశక్తుల ముద్ర వేసి.. జైల్లో వేసేందుకు కూడా సిద్ధమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే..రాజధాని ఉద్యమం.. కొంత మంది నాయకత్వంలో నడవడం లేదని.. ఎంత మందిని జైల్లో వేస్తే.. అన్ని వేల మంది రోడ్ల మీదకు వస్తారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని.. రైతులు హెచ్చరిస్తున్నారు.