వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో చివరిన కూర్చున్నా.. అసలు కూర్కోకపోయినా ప్లేట్లో భోజనం మన దగ్గరకే వస్తుంది. కాదంటే ఆంధ్రప్రదేశ్‌కు వరుస కడుతున్న అధికారులు… అందరం ఎక్కుతున్న అధికారులు… పదవులు పొందుతున్న జాబితాను దగ్గర పెట్టుకుని చూడండి క్లారిటీ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేయడానికి కీలకమైన అధికారుల కొరత ఉందేమో కానీ.. ఉన్న పళంగా.. రైల్వే నుంచి ఓ అధికారిని ఏపీ సర్కార్ డిప్యూటేషన్‌పై పిలిపించుకుంది.
ఆయన పేరు రవీన్ కుమార్ రెడ్డి. ఐఆర్టీఎస్ క్యాడర్‌కు చెందిన రవీన్ కుమార్ రెడ్డి.. రెండు రోజుల కిందటి వరకు సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో పని చేస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం లాబీయింగ్ చేసి.. రైల్వే ఉన్నతాధికారులను ఒప్పించి… ఏపీ ప్రభుత్వానికి డిప్యూటేషన్ పై వచ్చేలా చేసుకున్నారు. నేడో.. రేపో ఆయనకు… కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. చట్ట విరుద్ధంగా ఉంటున్న ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడానికి జంకుతున్నారు.చాలా మంది కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. ఈ కారణాలన్నింటితో అధికారుల కొరత ఏర్పడుతోంది. అదే సమయంలో… తమకు నమ్మకమైన అధికారుల కోసం.. ఏపీ సర్కార్ వేట సాగిస్తోంది. తమ వారు అనుకున్న వారు రైల్వేలో ఉన్నా.. రెవిన్యూ సర్వీస్ లో ఉన్నా… ఏపీకి తీసుకొచ్చేస్తోంది.