✍ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు కలిసిన సంగతి తెలిసిందే. వర్సిటీలో నెలకొన్న సమస్యలపై వారు పవన్ కళ్యాణ్‌కు విన్నవించగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ వర్సిటీ సమస్యలపై స్పందించారు. వర్సిటీ వీరయ్య, రిజిస్ట్రార్ శివశంకర్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు.
? కాగా, శుక్రవారం నాడు నెల్లూరు వర్సిటీ విద్యార్థులు రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇందుకోసం 10మంది విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా శివశంకర్ అక్రమాలపై పవన్ కు విన్నవించారు. విద్యార్థుల వసతి, తరగతి గదులు, పరిపాలన కోసం భవనాల నిర్మాణానికి 25 కోట్లు కేటాయించినా.. కేవలం రూ.5కోట్లతో నాసిరకం పనులు చేపట్టారని పవన్ కు వివరించారు.
? వర్సిటీ రిజిస్ట్రార్ పై భూఆక్రమణ ఆరోపణలు కూడా ఉండటం గమనార్హం. పీజీ కాలేజీ కోసం కేటాయించిన భూమిలో 3ఎకరాలను బయటి వ్యక్తులతో కలిసి కబ్జా చేయించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
✍ నిర్మించిన భవనాలు కూడా ప్రారంభం కాలేదు..:
? సీఎం రాక కోసం ఎదురుచూస్తూ నిర్మించిన భవనాలను కూడా వర్సిటీ అధికారులు ఇంతవరకు ప్రారంభించలేదు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా నాసిరకంగా వీటిని నిర్మించడంతో విద్యార్థులు గత కొద్దిరోజులుగా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు.
ఇదే క్రమంలో గత బుధవారం రిజిస్ట్రార్ ను నిర్బంధించిన విద్యార్థులు హాస్టల్, మెస్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
సీఎం వస్తేనే భవనాలు ప్రారంభిస్తామని వీసీ స్పష్టం చేశారు. ఆపై విద్యార్థులు పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యలపై విన్నవించిన సంగతి తెలిసిందే.