ప్రపంచ ప్రమాణాల గురించిన ప్రచారంతో సాగుతున్న అమరావతి నిర్మాణాలలో కనీస నిర్మాణ ప్రమాణాలైనా పాటిస్తున్నారా అని సందేహం కలుగుతుంది. గతంలో జరిగిన ప్రమాదాలు చాలక ఇప్పుడు గోడ కూలిపోయింది. షాపూర్జిపల్లోంజి సంస్థలో పనిచేస్తున్న రామ్చంద్, ధర్మేంద్ర, కిరణ్ చౌదరి, జయరామ్లకు తీవ్ర గాయాలు తగిలాయి. మరొకరు కూడా గాయపడ్డారు.పైనుంచి పిట్టగోడ కూలి పడటంతో రామ్చంద్కు వెన్నెముక విరగ్గా, ధర్మేంద్రకు తలకు ఛాతికి తీవ్రగాయాలైనాయి. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యుల తొలి సమాచారంగా వుంది. గతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బయిటకు రాని రాని ఘటనలు కూడా కొన్ని వున్నాయి. ఈ ప్రమాదాలకు ఏవో సాంకేతిక కారణాలు సాకులు చెబుతారు కాని అసలు ఇలాటి దుస్థితి ఎందుకు వస్తున్నది? ఈ అపశ్రుతులన్నిటి వెనక అలక్ష్యం అవినీతి అసమర్థత లేదని భావించడం సాద్యమేనా? రేపటి రాజధానిలోనూ కొనసాగుతుందంటున్న భవనం అదికూడా కావలసిన సమయం తీసుకుని విడిగా కడుతున్న పరిస్థితుల్లో ఎందుకిలా పదే పదే ప్రమాదాలు మరణాలు గాయాలు సంభవిస్తున్నాయి? పోనీ హడావుడి వల్ల ఇలా జరుగుతుందనుకుంటే కాస్త నెమ్మదించవచ్చు. కడుతున్నదెవరు?కట్టిస్తున్నదెవరు?పర్యవేక్షిస్తున్నదెవరు?వైఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రో నిర్మాణ సందర్భంలో ఒక ప్రమాదం జరిగితే అప్పుడు ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలూ తీవ్రంగా విమర్శించలేదా? అలాటిది సాక్షాత్తూ రాష్ట్ర పాలనా కేంద్రం కాబోతున్న భవనంలతోనే వరుస ప్రమాదాలు దుర్ఘటనలు జరిగే పరిస్థితి ఎందుకు దాపురిస్తున్నది?వీటిపై వివరాలు వెల్లడించరు. మీడియాను అనుమతించరు. నిరసనలు సాగనివ్వరు. భద్రతా కల్పించరు. తనిఖీలుండవు, బడామీడియాలో వివరాలు రావు. అంతా గప్చిప్. పనిచేస్తున్నవారిలో అత్యధికులు జార్ఖండ్నుంచి వచ్చిన వారు. వారి జీతభత్యాలు కూడా చాలా తక్కువ.పనివొత్తిడి బాగా ఎక్కువ. స్థానికంగా వారిని కలవనివ్వరు.బయిటకు చెప్పిన వారిపై కక్షసాధింపులు. హక్కులు భద్రత నాస్తి.అందరి హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వ సచివాలయ నిర్మాణంలోనే ఈ పరిస్థితి నిజంగా ఆందోళనకరం. అప్రజాస్వామికం. ఇప్పటికైనా నిర్మాణంలోనూ కార్మికుల పరిస్థితుల్లోనూ భద్రత పెంచడం అవసరం. పైపై ఖండనలతో సరిపెడితే రేపు మరింత ముప్పు కలగొచ్చు.