తెలుగు సినీ కళాకారుల్ని గౌరవించుకొనే అపురూపమైన వేదిక నంది పురస్కారాలు. అయితే తెలుగు రాష్టాలు రెండుగా విడిపోవడంతో… దాని మాటే మరిచిపోయారు. కళలకు పెద్ద పీట వేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాకతీయ పేరుతో ఓ అవార్డుని స్థాపించి.. తెలుగు సినీ కళాకారుల్ని ప్రోత్సహించాలని చూస్తోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు తయారవుతున్నాయి కూడా. అన్నీ అనుకొన్నట్టు జరిగితే… ఉగాది రోజున ఈ విషయమై ఓ స్పష్టమైన ప్రకటన రావొచ్చు.
అయితే ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీనమేశాలు లెక్కేస్తోంది. నంది పురస్కారాలు ఇవ్వాలా, వద్దా, ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలి? నంది పేరుతోనే ఇవ్వాలా, లేదంటే కొత్త పేరుని ప్రతిపాదించాలా, ఇస్తే ఎవరికి ఇవ్వాలి? తెలంగాణ కళాకారుల్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలా.. ఇలా సవాలక్ష ప్రశ్నలతో సతమతమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి నందిని పెండింగ్లో పెట్టేశారు. ఇప్పటికైనా… కాస్త సానుకూల దృక్పథంతో ఏపీ ప్రభుత్వం నంది పురస్కారాలపై ఓ నిర్ణయం తీసుకొంటే మంచిది.