తిరుమల వెంకన్న పాలక మండలి ప్రకటన ఇంకెప్పుడు? కొత్త ప్రభుత్వం వచ్చి కుదురుకుంది. పాలనలో స్పీడ్ పెంచుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా రంగం సిద్ధం చేసింది. అయినా ఇంకా టీటీడీ బోర్డు సంగతి మాత్రం ఏటూ తేలటం లేదు.
సర్కార్ వచ్చిన కొత్తలోనే టీటీడీ బోర్డు చైర్మన్ గా జనసేన నేత నాగబాబు పేరు ప్రచారం జరిగింది. కానీ అది కేవలం ప్రచారమే. ఆ ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం పవన్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత చాలా పేర్లు తెరపైకి వచ్చినా… ఓ మీడియా అధినేతకు దక్కుతుందని, ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అది కూడా ప్రచారంగానే మిగిలిపోయింది.
నిజానికి టీటీడీ చైర్మన్ పోస్టుకు ఉండే పోటీ చాలా ఎక్కువ. మంత్రి పదవితో సమానంగా చూసే వారు చాలా మంది ఉంటారు. పైగా ఎంతో ఆరాధించే దేవస్థానంకు బాస్ పదవి. పైగా ఈసారి టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా పోటీలో ఉండటంతో కూటమి పార్టీల అధినేతలకు ఇబ్బందిగా మారిపోయింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారు. ఈవో నుండి కింది స్థాయి అధికారుల వరకు కీలకమైన అధికారులను బదిలీ చేశారు. కొత్త ఈవో కూడా భక్తుల సౌకర్యాలు, ప్రసాదాల నాణ్యత, దర్శనానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బోర్డు కూడా అలాగే పనిచేయాలి తప్పా రాజకీయాలు తీసుకరాకుండా ఉండేలా సభ్యులు, చైర్మన్ ఎంపిక ఉండాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.