వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు గవర్నర్ కోటా కింద భర్తీ చేయవచ్చు. ఈ మూడు సీట్ల కోసం.. వైసీపీ అధినేత జగన్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మంత్రిని చేస్తానని మాట ఇచ్చిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే.. కడప జిల్లా రాయచోటి నుంచి ముస్లిం మైనార్టీకి.. గోదావరి జిల్లాల నుంచి మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో… టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనీకి టిక్కెట్ ఇచ్చిన జగన్.. మర్రి రాజశేఖర్ కు హ్యాండిచ్చారు. ఎన్నికల ప్రచారంలో చిలుకలూరిపేట వెళ్లిన జగన్… రజనీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే.. తొలి విడత మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. ఆ తర్వాత శాసనమండలిని కూడా రద్దు చేయాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. ఇక మర్రి రాజశేఖర్ మంత్రి పదవి గాల్లో దీపమేనని అందరూ అనుకున్నారు. అయితే.. ప్రస్తుతం శాసనమండలి రద్దు బిల్లు కేంద్రం వద్ద ఉంది. ఆ బిల్లును కేంద్రం ఆమోదిస్తుందా లేదా.. అన్నదానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. కానీ శాసనమండలిని రద్దు చేసి తీరుతానన్నంత పట్టుదలతో తీర్మానం చేసిన జగన్.. రద్దయ్యే మండలిలో ఖాళీ అయిన స్థానాలను నింపుకుంటూ వెళ్తున్నారు.
ఒక వేళ.. మర్రి రాజశేఖర్ కు.. ఎమ్మెల్సీ ఇచ్చి… శాసనమండలిని రద్దు చేయకపోతే… వచ్చే విడతలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడతారు అనే ఇమేజ్ కు మచ్చ వస్తుంది. తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. ఒక వేళ ఇస్తే.. శాసనమండలిని రద్దు చేస్తున్నాం అని తీర్మానం చేసి… తమ మంత్రి పదవుల్ని ఊడబీకేసి… తమ ప్లేస్‌లో ఇతరులకు పదవులు ఇచ్చి వారిని మంత్రుల్ని చేస్తారా.. అని.. మోపిదేవి, పిల్లి ఫీలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. రాజ్యసభ సభ్యులుగా చేయడానికి ఏమీ ఉండదు. అదే మంత్రులతో.. పెత్తనం అయినా ఉంటుంది.
అలాగే.. ఎన్నికల సమయంలో.. జగన్మోహన్ రెడ్డి.. పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవుల హామీలు నేతలకు ఇచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేకపోయిన వాళ్లు.. ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వారికి.. ఈ హామీలు ఇచ్చారు. వారందరూ ఎమ్మెల్సీల మీద ఆశ పెట్టుకున్నారు. కానీ.. మండలిని రద్దు చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించిన తర్వాత ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు ఆ మండలి రద్దు అవుతుందో లేదో.. క్లారిటీ లేదు కాబట్టి.. తమ పదవి సంగతేమిటని.. హైకమాండ్‌కు.. విజ్ఞప్తులు పంపుతున్నారు.