కేబినెట్ మంత్రి హోదాతో ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చర్య కేవలం కొంత మంది ఉద్యోగుల మీద జరిగింది కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగంపై అధికార పార్టీ దాడిగానే ప్రభుత్వోద్యోగులు పరిగణిస్తున్నారు. మహిళా ఉద్యోగులు చాలా ఆగ్రహంతోవున్నారు. ఎంక్వైరీ వేశామని ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకోవడం కంటే దెబ్బలుతిన్న తాసిల్దార్ వనజాక్షిని ‘అంతా నీవల్లే’ అని చివాట్లు పెట్టడమే వారికకి బాధాకరంగానూ అభ్యంతరకరం గానూ వుంది. ఆమె తమ జిల్లా హద్దులు దాటి వుంటే శాఖాపరంగా చర్యలుతీసుకోవచ్చు. బాధితురాలిపై ఆగ్రహం వెలిబుచ్చి దాడిచేసిన వారిని ఒక్కమాటా అనకపోవడంపట్ల ఉద్యోగులు ముఖ్యమంత్రి మీద తీవ్ర అసంతృప్తితో వున్నారు. వేరేపార్టీ ఎమ్మెల్యే ఇదేపని చేసివుండే ఊరుకునేవారా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ పాలనలో తహసీల్దార్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. పోలీస్ ఫైరింగ్‌కు ఆదేశాలిచ్చే అధికారం ఉన్న వ్యక్తి. అలాంటి అధికారినే జుట్టుపట్టుకొని ఈడ్చిపారేశారు. ఆమె సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. తహసీల్దార్ ముందే రెవెన్యూ సిబ్బందిని బాదారు. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని తహసీల్దార్ కంటతడిపెట్టి, సర్కారుకు ఫిర్యాదు చేశారంటే అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్మార్గాల తీవ్రత అర్థం కావట్లేదా? మరి సాధారణ మహిళల రక్షణ సంగతేంటి? మహిళలను ఉద్ధరిస్తామంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి అడ్డొచ్చిన తహసీల్దార్‌పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయించటం తప్పే. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం మరీ దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రభుత్వ యంత్రాంగ మనోస్థైర్యంపై వేసిన వేటు. ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదంటేనే ప్రభుత్వం ఎవరి వైపున ఉందో తెలిసిపోతున్నది. పైగా అదేదో డ్వాక్రా మహిళలు, రెవెన్యూ సిబ్బంది గొడవగా, జిల్లా సరిహద్దు సమస్యగా చిత్రీకరించి ఎమ్మెల్యేని కాపాడేందుకు ప్రయత్నించడం ఆశ్రితపక్షపాతం కిందకే వస్తుంది. ఇసుక అక్రమ రవాణాకు ఒడిగట్టిన చింతమనేని మామూలు ఎమ్మెల్యే కూడా కాదు. ఇసుక అక్రమాలకు పాల్పడటమేంటి? అడ్డుకున్న ప్రభుత్వ యంత్రాంగంపై వీధి రౌడీలా గూండాయిజానికి దిగడమేంటి? సర్వత్రా నిరసనలు ఎగసిపడ్డాకైనా సదరు ఎమ్మెల్యేలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోగా దుందుడుకుతనం తన నైజమని నొక్కి వక్కాణించడం మరీ దారుణం. చింతమనేనిపై రౌడీషీట్ సహా 34 కేసులున్నాయి. గతంలో తన ఇసుక అక్రమాలకు అడ్డొచ్చిన ఆర్‌డిఒ, డిపిఒలపై దాడి చేసిన చరిత్రకూడా ఉంది. ఉన్నతాధికారులపైనే దాడి చేసిన సదరు ఎమ్మెల్యేకి మహిళా తాహసీల్దార్ ఒక లెక్కా? ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చంద్రబాబు ఎమ్మెల్యేను చేయడమే కాకుండా విప్ పదవి కూడా కట్టబెట్టారంటే అతని అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లే అనుకోవాలి.
కొన్నేళ్లుగా ఇసుక అక్రమాలకు భౌగోళిక, రాజకీయ ఎల్లలు ఏమాత్రం లేవు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రధాన పార్టీల నేతలు ఇసుక దోపిడీలో పాల్పంచుకోవడం తెలిసిందే. దొంగలు దొంగలు ఊళ్లుపంచుకున్న బాపతు. లావాదేవీల్లో తేడా వచ్చినప్పుడు విమర్శించుకోవడం, అంతా బాగుంటే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని కానివ్వడం మామూలైపోయింది. విచ్చలవిడి తవ్వకాల వలన భూగర్భ జలాలకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని గతంలో హైకోర్టు కొరడా ఝుళిపించింది. కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. దీంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇసుక ధర మాత్రం కొండెక్కింది. పేదలకు, పక్కా ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉన్నా అమలు కావట్లేదు. సంప్రదాయక ఎడ్లబళ్లపై ఏ నది నుంచైనా ఇసుక తీసుకెళ్లొచ్చనే నిబంధన ఏమైందో తెలీదు. డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌ల వద్ద సీనరేజి వసూలు బాధ్యతలు అప్పగింత మోసం. పేరు డ్వాక్రా మహిళలది కాగా ఆ ముసుగులో ‘పెద్దలు’ ఇసుకను అక్రమంగా కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తడం ప్రభుత్వ లోపభూయిష్ట విధానానికి నిదర్శనం. బినామీల అక్రమవ్యాపారంలో అడ్డంగా మిగిలిపోయే సొమ్ముకోసం అధికారంలో వున్నవారే మాఫియాగా మారిపోవడం పై కఠిన చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రే దౌర్జన్యపూరితమైన అక్రమసంపాదనకు వత్తాసుపలుకుతున్నారన్న సంకేతం ప్రజల్లోకి గట్టిగా వెళ్ళిపోతుంది.
మహాభారతంలో నిండుసభలో ద్రౌపదిని అవమానపరచిన నేరం దుశ్శాసనుడిదీ, ప్రేరేపించిన దుర్యోధనుడిదీ మాత్రమేకాదు. పుత్రప్రేమతో మౌనం పాటించిన దృతరాష్ట్రుడిదీ, తప్పు అనిచెప్పలేని భీష్మద్రోణాదులది కూడా! పార్టీ, ప్రతిష్టలకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పట్ల దృతరాష్ట్రుడులాగా వ్యవహరించారని ప్రభుత్వోద్యోగులు అభిప్రాయపడుతున్నారు.