ఈ వారం రోజుల్లోనూ మూడు నాలుగు విషయాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రాజకీయంగా ఇరకాటం ఎదురైందని చెప్పాలి. మంత్రివర్గం నిర్ణయాల్లోనే ఆ ఇరకాటం ప్రతిబింబించింది. బెల్టు తీయాలని అంటే బెల్టు షాపులు ఎత్తివేయాలని క్యేబినెట్లో ముఖ్యమంత్రి సీరియస్గా ఆదేశాలిచ్చారట. అంటే మొదటి సంతకం వాటిపైనే అయినా మూడేళ్ల కాలంలో అమలు కాలేదని అంగీకరించినట్టే కదా.. కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన మంజునాథ కమిషన్ నియామకమే పరిష్కారమని చెప్పిన స్థితి పోయి ఇప్పుడు ఆ కమిషన్ను త్వరగా నివేదిక తయారు చేయమని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాల్సి వచ్చింది. అది కూడా న్యాయశాఖ లేఖ ద్వారా. నిస్సందేహంగా ఇది ఒక కొలిక్కి రాదు. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులపైనా హైకోర్టు నోటీసులు రావడంతో కొన్ని చోట్ల స్థానికంగా ఆయా నాయకుల అనుయాయులలో ఆందోళన మొదలైందట. చివరగా అమరావతి తాత్కాలిక సచివాలయంలోకి అంతగా నీరు రావడంపై సమర్థించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదో షీటుపైకి సాకు పెట్టినా ప్రతిష్టాత్మక ప్రభుత్వ కేంద్ర స్థానం నిర్మాణంలో ఇవన్నీ అంచనా వేసుకోవాలి కదా.. గతంలో జగన్ ఛేంబర్లోకి రావడానికి వారు పైపులుకోయడమే కారణమని చెప్పగా ఇప్పుడు అంతకు అనేకరెట్లు నీళ్లొచ్చాయి. దీనివల్ల జగన్పై ఆరోపణ కూడా అవాస్తవమేనా అని సందేహించే పరిస్తితి ఏర్పడుతుంది. నిర్మాణాల నాణ్యతపైనా ప్రశ్నలు తలెత్తుతాయి. మంత్రి నారాయణ ఏమీ జరగలేదని కప్పిపుచ్చేబదులు లోతుగా పరిశీలించి పునరావృతం కాకుండా చూడటం మేలు.