కరోనా బారిన పడిన వారికి రూ. రెండు వేలు, ప్లాస్మా ఇచ్చిన వారికి రూ. ఐదు వేలు….. చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ. పదిహేను వేలు.. ఇలా కరోనా బాధితులకు ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి చెప్పారంటే.. చేస్తారనే క్యాప్షన్‌ను బట్టి.. కరోనా రోగులందరికీ.. ఈ సాయం అందుతోందేమో అని అనుకున్నారు. కానీ ఏపీలో ప్రస్తుతం ఎవరికీ ఎలాంటి సాయం చేయడం లేదు. ఎంతగా అంటే.. కరోనా బారిన పడిన వారికి ఇస్తామన్న రూ. రెండు వేలు కూడా ఇవ్వలేకపోతున్నారు. దీంతో… కరోనా రోగులు.., అధికారులతో గొడవలు పడుతున్నారు.
కరోనా పెద్ద రోగమేం కాదని.. బలమైన ఆహారం తిని.., రోగ నిరోధక శక్తి పెంచుకుంటే తగ్గిపోతుందని సీఎం జగన్ చెబుతూంటారు. అందుకే కరోనా బారిన పడిన వారికి రెండు వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మొదట్లో కొంత మందికి ఇచ్చారు. ఘనంగా మీడియాలో ప్రచారం చేశారు.. కానీ రాను రాను రోగుల సంఖ్య పెరుగుతూ ఉండే సరికి…డబ్బులు ఇవ్వడం కష్టంగా మారింది. దాంతో ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత జగన్ ప్లాస్మా దానాన్ని ప్రోత్సహించాలని… రూ. ఐదు వేలు ప్రకటించారు. ఎక్కడ ఇస్తున్నారో.. ఎవరికి ఇస్తున్నారో క్లారిటీ లేదు. అంత్యక్రియలకు రూ. పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ.. వాటి విధివిధానాలపై ఇంత వరకూ క్లారిటీ లేదు.
ప్రస్తుతానికి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో.. కరోనా రోగులకు ఆర్థిక సాయానికి నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదు. అయితే.. ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా అమలు చేయకపోతే.. ఆయనకే చెడ్డపేరు వస్తుంది. సీఎం చేసిన ప్రకటలన్నీ ఆర్భాటమేనా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ అంశంపైనైనా ఆలోచించి.. జగన్ చెప్పినట్లు అందరికీ ఆర్థిక సాయం పంపిణీ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులతో పోలిస్తే.. ఓ రూ. రెండువేలు పెద్ద మొత్తం కాదంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఇమేజ్ను కాపాడే ప్రయత్నం చేస్తారో లేదో..!