ఉమ్మడి ఆస్తులు పంచాలని తెలంగాణను ఒక్క మాట కూడా అడగదు ఏపీ ప్రభుత్వం. కేంద్రం దగ్గర పంచాయతీ పెడితే పట్టుబట్టదు. ప్రమాణస్వీకారం చేయక ముందే కొన్ని ఆస్తులు తెలంగాణకు ఇచ్చేశారు జగన్. కనీసం కరెంటు బిల్లుల బకాయిలు కూడా వెనక్కి తీసుకోలేకపోతున్నారు. నాలుగేళ్లయినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు హఠాత్తుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని.. పంచడం లేదని.. పంచేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో ఏపీ ప్రభుత్వం కోరుతోంది.
ఉమ్మడి ఆస్తుల విలువ రూ. 1, 42, 601 కోట్లు ఉందని.. దాన్ని విభజించలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణనే కాలయాపన చేస్తోందని విభజన జరగాల్సిన ఆస్తులు 91 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు. విభజన జరిగి ఎనిమిది ఏళ్లవుతున్నా.. ఆస్తుల విభజనకు తెలంగాణ సర్కార్ సహకరించడం లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని కోరింది.
ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ ప్రయోజనాలపై జగన్ పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని.. అలా అయితే ఆయన రాజకీయ భవిష్యత్ కు పులిస్టాప్ పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆ అంశంపై దుమారం రేగింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. అయితే ఉండవల్లి డిమాండ్ చేసినట్లుగా.. ఆయన దాఖలు చేసిన పిటీషన్లో ఇంప్లీడ్ కాకుండా… ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్.
అయితే ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల మరింత ఏపీ నష్టపోతోందన్న వాదన వినిపిస్తోంది. అంత పెద్ద ఎత్తున ఆస్తులను.. కేంద్రంతో మాట్లాడి అయినా పంచుకోవాలి కానీ.. ిలా కోర్టుకెక్కడం వల్ల.. అక్కడే ఉండిపోతాయని.. ఎప్పటికీ తేలవన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.